విశాఖపట్నం – వైఎస్ జగన్‌కు మరో భారీ షాక్ తగిలింది.. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గుడ్‌బై చెప్పేశారు.. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి రాజీనామా లేఖ రాశారు అవంతి శ్రీనివాస్..
కొంత కాలంగా పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు అవంతి శ్రీనివాస్.. 2019 ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి అయిన అవంతి శ్రీనివాస్.. వైసీపీ హయంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు.. ఇక, తాజా ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు.. అయితే, అవంతి పార్టీ వీడుతున్నారంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతోంది.. చివరకు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమై.. పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖను పంపించారు..
అయితే, “నా వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం వలన భీమిలి నియోజకవర్గం ఇంఛార్జ్ బాధ్యతలను మరియు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.. మీరు ఇచ్చిన అవకాశానికి నా ధన్యవాదములు.. నీ రాజీనామాను ఆమోదించ వలసిందిగా కోరుతున్నాను” అంటూ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు..
ఈ సందర్భంగా మీడియాతో అవంతి మాట్లాడుతూ… పార్టీ అధ్యక్షుడు జగన్ పై విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే… ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం సరికాదని ఆయన అన్నారు. ప్రభుత్వానికి కనీసం ఒక ఏడాది సమయం ఇవ్వాలని చెప్పారు. ఐదు నెలల సమయం కూడా ఇవ్వకుండానే ధర్నాలు చేయాలంటే ఎలాగని ప్రశ్నించారు.
ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ గౌరవించాలని అవంతి అన్నారు. ఐదేళ్లు పాలించాలని కూటమికి ప్రజలు అవకాశం ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఎన్నో పథకాలను అమలు చేసి కూడా ఎన్నికల్లో ఓడిపోయామంటే తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలని చెప్పారు. పార్టీ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని అన్నారు. వైసీపీ పాలనలో పార్టీ కార్యకర్తలంతా నలిగిపోయారని చెప్పారు. తాడేపల్లిలో కూర్చొని జగన్ ఆదేశాలు ఇస్తుంటారని… క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడేది కార్యకర్తలని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో కార్యకర్తలకు గౌరవం లేదని విమర్శించారు.
చిరంజీవిపై ఉన్న అభిమానంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని, నిజయతీగా ప్రజలకు సేవ చేశానని తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. తన కుటుంబానికి సమయం ఇవ్వాలనుకుంటున్నానని, తమ విద్యాసంస్థలను కూడా చూసుకోవాల్సి ఉందని తెలిపారు.
ఇక, అవంతి శ్రీనివాస్ 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు.. అయితే, 2014 ఎన్నికలలో టీడీపీ గూటికి చేరి అనకాపల్లి నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఇక, 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్.. భీమిలి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. వైఎస్ జగన్ కేబినెట్ 1లో పర్యావరణ, అటవీశాఖ మంత్రిగా పనిచేశారు.. కానీ, జగన్ కేబినెట్ 2లో ఆయన్ని పక్కన బెట్టారు.. ఆ సమయంలో పలు వివాదాల్లో కూడా అవంతి పేరు వినిపించింది.. ఇక, తాజాగా జరిగిన ఎన్నికలలో అవంతి శ్రీనివాస్ భీమిలిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతిలో ఏకంగా 92,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు.