ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం ఉదయం ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మంగళవారం పంచెకట్టులో అసెంబ్లీకి వచ్చారు. ఈ క్రమంలో నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ముందుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును ఉద్దేశించి మాధవి మాట్లాడుతూ.. చక్కటి పంచెకట్టులో డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన రోజు నేతన్నలకు సంఘీభావం తెలిపారు అంటూ ప్రశంసించారు. అనంతరం ఆమె చేనేత రంగం పలు సమస్యలు ఎదుర్కొంటోందని, ముఖ్యంగా నేతన్నలు మార్కెటింగ్ విషయంలో వెనుకబడుతున్నారని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
మీరు కట్టింది చేనేత చీరేనా?
ఇలా ఎమ్మెల్యే మాధవి సుదీర్ఘంగా చేనేత రంగ సమస్యలు ప్రస్తావిస్తుండగా.. రఘురామ కృష్ణంరాజు కలుగజేసుకుని, ఇది ప్రశ్నోత్తరాల సమయం కాబట్టి సుదీర్ఘ చర్చ అవసరం లేదన్నారు. మీ ప్రశ్నను నేరుగా అడగాలని సూచించారు. దాంతో నాగ మాధవి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసి ప్రశ్నను ముగించారు. ఈ సందర్భంగా రఘురామ.. మీరు కట్టుకున్నది చేనేత చీరేనా..? అని ప్రశ్నించారు. దాంతో మాధవి అవునని సమాధానమిచ్చారు. ఆ క్షణంలో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.