పాలనా అనుమతులిచ్చారు
కనీసం 5 రూపాయలు ఖర్చు పెట్టలేదు
రూ.1600 కోట్లతో టెండర్లు పూర్తి చేశాం
వచ్చే జూలైనాటికి ఉత్తరాంధ్రకు నీరిస్తాం
అసెంబ్లీలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల
ఆంధ్రప్రభ స్మార్ట్, వెలగపూడి : ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకుంటామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల సమాధానం ఇచ్చారు. నదుల అనుసంధానంతో రాష్ట్రంలో కరువు నివారించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు వ్యయం రూ.17,050 కోట్లు అని.. ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టుకు 63.20 టీఎంసీల గోదావరి వరద నీరు సరఫరా చేయాలని ప్రతిపాదించామన్నారు. 2019 – 24 వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్‌కు రెండు దశల్లో రూ.17,050 కోట్లకు పాలనా అనుమతులు ఇచ్చి కనీసం రూ. 5 పని కూడా చేయలేదని విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులున్నా రూ.1600 కోట్లతో ఇప్పటికే టెండర్లు పూర్తిచేసి టైం షెడ్యూల్ కూడా ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి ప్రాధాన్యత పోలవరం అయితే రెండో ప్రాధాన్యత ఉత్తారాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు. వచ్చేనెలలో పనులు ప్రారంభించి 2025 జులై నాటికి గోదావరి వరద జలాలను ఉత్తరాంధ్రకు అందిస్తామన్నారు.
ఎమ్మెల్యేల్లో నిరాశ
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల సమాధానం చాలా నిరాశకలిగిందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతాలు అని తెలిపారు. దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా వచ్చినందుకు సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ నిర్మాణాన్ని అప్పటి సీఎం చూశారని.. ఒకటిన్నర సంవత్సరాల్లో పూర్తి చేస్తామన్నారని.. కానీ ఎక్కడ పని అక్కడే ఉందన్నారు. ఉత్తరాంధ్ర నుండే వలసలు ఎక్కువయ్యాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల కంటే తక్కవ ఆదాయం ఉన్నది ఉత్తరాంధ్ర అని తెలిపారు. ఉభయ రాష్ట్రాల్లో అత్యంత తక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రం విజయనగరం అని.. ఈ పరిస్థితి మారాలంటే గోదావరి జలాలు ఉపయోగించుకోవాలన్నారు. పోలవరం నుంచి ఇచ్చాపురం వరకూ నీరు వెళ్లే పరిస్థితి ఉన్నా అప్పట్లో సాధ్యం కాలేదన్నారు. 2009లో ప్రారంభించినా తరువాత ఆగిపోయిందని తెలిపారు. రూ.2000 కోట్లు కేటాయించి ఈ పనులు ముందుకు తీసుకువెళ్ళారన్నారు. విజయనగరంలో 3,60,000 ఎకరాలు , విశాఖలో 3 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని.. ఉత్తరాంధ్ర పదహారు నదులు కలిపే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ వెల్లడించారు.