Tuesday, November 19, 2024

AP Assembly – సాగునీటి ప్రాజెక్ట్ లపై గత సర్కారు నిర్లక్ష్యం – అసెంబ్లీలో సభ్యులు గరం గరం

ఆంధ్రప్రభ స్మార్ట్, వెలగపూడి :

నీటిపారుదల ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పోలవరం విధ్వంసం సహా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వీర్యంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ నీటిపారుదల ప్రాజెక్టులపై పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించిందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. అనంతపురం, చిత్తూరుతోపాటు రాయలసీమ జిల్లాలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరని ద్రోహం చేశారని ఆయన ధ్వజమెత్తారు.

రాయలసీమకు నీళ్లు ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలు ఆధారంగా ఏర్పడిందని, అలాంటి నీళ్లు ఏపీ సాధించుకోవడంలో గత టీడీపీ ప్రభుత్వం కృషి ఎంతో ఉందని కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు 512 టీఎంసీలను ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు కేటాయించేలా సీఎం చంద్రబాబు కృషి చేశారని ఆయన చెప్పారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల రాయలసీమ అత్యంత నీటి దుర్భిక్షంతో కొట్టుమిట్టాడుతోందని ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆగ్రహించారు. కనీసం తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అసెంబ్లీ సాక్షిగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నీటి ఇబ్బందులు లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు చెప్పారు.

వారిని పట్టించుకోలేదు..
పోలవరం నిర్వాసితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం భూములు, ఇళ్లు వదులుకున్నారని అసెంబ్లీలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు చెప్పారు. వారి కోసం 70 శాతం పునరావాస కార్యక్రమాలు గత టీడీపీ హయాంలోనే పూర్తి చేశారని ఆయన చెప్పారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో ఒక్క నిర్వాసితుడీ న్యాయం చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత పోలవరాన్ని ఏపీకి కేంద్రం ఇచ్చిందని, దాన్ని మెుదట నాశనం చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి వెల్లడించారు. 960 మెగావాట్ల విద్యుత్, లక్షల ఎకరాలకు సాగునీరు, 60 లక్షల గృహాలకు విద్యుత్ ఇవ్వగల ప్రాజెక్టు పోలవరం అని ఆయన చెప్పుకొచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో నవయుగ కంపెనీ 72 శాతం పనులు పూర్తి చేయడంతోపాటు గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించిందని అసెంబ్లీలో ఆయన చెప్పారు. అయితే ప్రభుత్వం మారడంతో 10 నెలలపాటు రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్‌ను మార్చి ప్రాజెక్టును రివర్స్ చేశారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. అటువంటి ప్రాజెక్టును తిరిగి చంద్రబాబు సీఎం అయ్యాక.. కేంద్రం నుంచి రూ.13వేల కోట్లు తెచ్చి మరలా జీవం పోసారని కొనియాడారు.

- Advertisement -

అందుకే కొట్టుకుపోయింది..
వైసీపీ హయాంలో గత అయిదేళ్లపాటు ఒక్క ఎకరాకు అదనపు నీరు ఇవ్వలేదని ఏపీ అసెంబ్లీలో చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని చెప్పిన ఫ్యాన్ పార్టీ అధినేత చివరకు ఉన్న ప్రాజెక్టులనూ పట్టించుకోలేదని మండిపడ్డారు. కమీషన్ల కోసం రివర్స్ టెండరింగ్‌కు గత ప్రభుత్వం వెళ్లిందని ఆరోపించారు. పల్నాడు జిల్లాలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. పోలవరం వద్ద ఎగువ కాఫర్ డ్యామ్ గ్యాప్ భర్తీ చేయకపోవడం వల్ల డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు. పోలవరానికి జగన్ పొగపెట్టారని, అమరావతికి అగ్గిపెట్టారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. గండికోట ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వకుండా ఆపేశారని ఆయన ఆగ్రహించారు. వైసీపీ అధినేత జగన్‌కు ఏ సబ్జెక్టుపైనా అవగాహన లేదని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement