Friday, November 15, 2024

AP Assembly – వారిదంతా ఆర్థిక ఉగ్ర‌వాదం .. ఆయ‌న నిండా ముంచాడు:చంద్రబాబు

అవినీతి అక్రమాలతో రాష్ట్రాన్ని దెబ్బతీశారు
పెట్టుబడిదారుల్ని తరిమేశారు
సంపద సృష్టించే ప్రాజెక్టుల్ని అడ్డుకున్నారు
ఇప్పుడిప్పుడే అన్నింటినీ గాడిలో పెడుతున్నాం
మహిళలను కించపరిస్తే ఇక మీద‌ట సహించం
అసెంబ్లీ బ‌డ్జెట్ భేటీలో సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రభ స్మార్ట్, వెలగపూడి :
గత ప్రభుత్వం అన్ని వ్యవస్ధలను నాశనం చేసింది. అయిదేళ్లలో వినూత్న రీతిలో దోపిడీ చేశారు. అస్తవ్యస్థ ఆర్ధిక నిర్వహణలో రాష్ట్ర పరిస్ధితి వెనక్కి పోయింది. ఏపీని ఆయన నిండా ముంచాడు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టటమే మా పని అని సీఎం చంద్రబాబు అన్నారు. నాలుగో రోజు అసెంబ్లీ భేటీలో బడ్జెట్‌పై మాట్లాడుతూ.. ఏపీ జీవనాడి పోలవరం పనులు పూర్తి చేస్తే ఈ రాష్ట్రానికి కరువనేది రాదు. విద్యుత్ బకాయిలు పెట్టి ఓపెన్ మార్కెట్లో విద్యుత్తు కొనాలని చూశారు. 1.29 లక్షల కోట్ల నష్టంలోకి విద్యుత్ శాఖను నెట్టేశారు. భూములు లాక్కోవడానికి 22ఏ తీసుకొచ్చారు. సంపద సృష్టించే ప్రాజెక్టులు ఆపేశారు, పెట్టుబడులు పెట్టేవారిని తరిమేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పారిపోయేందుకు సిద్ధంగా లేనని చెప్పాను. ఇప్పుడు భావితరాలకు మేలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం’ అని చంద్రబాబు అన్నారు.

రాష్ట్ర విభజన సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నామ‌ని సీఎం అన్నారు. 2014లో లోటు కరెంట్‌ ఉండేది. పలు విధానాలు తీసుకొచ్చి.. ఇప్పుడు మిగులు కరెంట్‌ పరిస్థితికి తెచ్చాం. రాష్ట్రంలో సరికొత్త ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. అమరావతి రైతులు నమ్మకంతో భూములు ఇచ్చారు. 2019లోనూ మేం విజయం సాధించి ఉంటే.. 2021లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. గత ప్రభుత్వం జీవోలను కూడా ఆన్‌లైన్‌లో పెట్టలేదు. విభజన నష్టం కంటే.. గత ఐదేళ్లలోనే ఎక్కువ నష్టం జరిగింది’ అని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు అన్నారు.

- Advertisement -

ఆర్థిక ఉగ్రవాదం సృష్టించారు
గత ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదాన్ని సృష్టించింది. ప్రజలు విశ్వసించి ఓటేస్తే… దుర్మార్గంగా ప్రవర్తించారు. గత ప్రభుత్వం సంపద సృష్టించే ఒక్క పని కూడా చేయలేదు. పెట్టుబడులు పెట్టేందుకు వస్తే తరిమేశారు. రూ.131 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించారు. రుషికొండ ప్యాలెస్లు చూస్తే నాకే కళ్లు తిరుగుతున్నాయి. ప్రజాధనంతో ఇంత పెద్ద ప్యాలెస్ కడతారా? పర్యావరణాన్ని విధ్వంసం చేసి రుషికొండ ప్యాలెస్ కట్టారు. రూ. 700 కోట్లతో సర్వే రాళ్లపై బొమ్మలు చేశారు. సాక్షికి రూ.300 కోట్ల ప్రకటనలు ఇచ్చారు. రూ.500 కోట్లు ఖర్చు చేసి ఉంటే రోడ్లు బాగయ్యేవి. ఇప్పటి వరకు రూ.8.74,556 కోట్ల అప్పు తేలింది అని వివ‌రించారు.

పోలవరాన్ని నిర్వీర్యం చేశారు
పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోతే రెండేళ్లపాటు పట్టించుకోలేదు. వైకాపా ప్రభుత్వ విధానాలతో ఉద్యోగ అవకాశాలు కోల్పోయాం. తప్పుడు విధానాలతో విద్యుత్ కొన్నారు. ఈ సంస్ధలను నష్టాల్లోకి నెట్టారు. గ్రామాల్లో ఉచితంగా లభించే ఇసుకపై వ్యాపారం చేసుకున్నారు. మద్యంపైనా ఇంతటా అవినీతి చేస్తారని మేం ఊహించలేదు. మద్యంపై రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చారు. చెత్తపైనా పన్ను వేసి ప్రజలను అనేక ఇబ్బందులు పెట్టారు. ఏడేళ్లపాటు హింసా రాజకీయాలు, కక్షపూరిత కార్యక్రమాలు చేపట్టారు. ప్రత్యర్ధిని దెబ్బతీసేందుడు అనేక పనులు చేశారు.

మహిళలను కించపరిస్తే సహించం

కన్నతల్లి శీలంపై హీనాతిహీన పోస్టులు పెట్టించారు. ఇక ఆడబిడ్డలను కించపరిచేలా పోస్టులు పెడితే ఉపేక్షించం. మహిళలను కించపరిచేలా కూటమి నేతలెవరూ పోస్టులు పెట్టరు.. పెట్టించబోరు. ఒక వేళ అదే జరిగితే చ‌ర్యలు క‌ఠినంగా ఉంటాయ‌ని చంద్రబాబు హెచ్చరించారు.

ఏనాడూ ఇలాంటి విజయం చూడలేదు

అవినీతి, అక్రమాలు చేసేందుకు కొందరు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ నా జీవితంలో ఇలాంటి ఘన విజయాన్ని చూడలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 93 శాతం స్ట్రయిక్ రేట్‌తో గెలవడం ఒక చరిత్ర అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తనపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. రాష్ట్రంలో గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ నెంబర్ .1గా ఉండటానికి కారణం టీడీపీ పార్టీనే అని సీఎం చంద్రబాబు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement