Thursday, November 21, 2024

AP Assembly – క‌ర్నూలులో హైకోర్టు బెంచ్‌ – అధికార వికేంధ్రీకరణతోనే సమగ్రాభివృద్ధి

రాయలసీమలోనే అవకాశాలు ఎక్కువ
కర్నూలులో బెంచ్‌ ఏర్పాటుకు తీర్మానం
ఏక‌స‌భ్య తీర్మానాన్ని ఆమోదించిన అసెంబ్లీ
మిష‌న్ రాయ‌ల‌సీమ‌తో స‌స్య‌శ్యామ‌లం చేస్తాం
అసెంబ్లీలో స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు

ఆంధ్రప్రభ స్మార్ట్, వెలగపూడి :
అధికార వికేంధ్రీకరణతో అన్ని ప్రాంతాల్లో సమగ్రాభివద్ది సాధ్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటునకు నిర్ణయించామని, ఏపీ హైకోర్టు శాశ్వత బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ కేంద్రానికి తీర్మానం పంపడంపై శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. బుధవారం కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలిపామని.. లోకాయుక్త , స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటివి అక్కడే ఉంటాయన్నారు. అమరావతి కూడా చాలా సార్లు చెప్పామని.. మూడు రాజధానులు అని చెప్పి మూడు ముక్కలాట ఆడారని మండిపడ్డారు. మన రాజధాని అమరావతి అని విశాఖ, కర్నూలు వాసులు కూడా ఆమోదం తెలిపారన్నారు. రాయలసీమ రాళ్ల సీమగా మారిపోతుంది అని అనుకున్నప్పడు బచావత్ అవార్డు ప్రకారం రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్ళామన్నారు. తెలుగుగంగా, హంద్రీనీవా, నగరీ, గాలేరు ప్రాజెక్టులను టీడీపీ ప్రారంభించి పూర్తిచేసిందన్నారు.

రాయలసీమలోనే ఎక్కువ అవకాశాలు

- Advertisement -

రాయలసీమకు ఉన్న అవకాశాలు చాలా ఎక్కువ అని.. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్ పోర్టులు రాయలసీమకు దగ్గర అని తెలిపారు. ఈ అవకాశాలను ఉపయోగించుకుంటే సీమ అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. తిరుపతి, కడప, ఓర్వకల్లు, పుట్టపర్తిలలో నాలుగు ఎయిర్ పోర్టులు రాయలసీమలోనే ఉన్నాయన్నారు. రాయలసీమను ఎడ్యూకేషన్ హబ్‌గా చేయడానికి ఎంతో ముందుకు వెళ్లిందన్నారు. మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి హమీని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిచేస్తుందని తెలిపారు. రాయలసీమలో నీటి సమస్యను ఎదుర్కోనేందుకు డ్రిప్ ఇరిగేషన్‌కు 90 శాతం సబ్సిడీ ఇచ్చామన్నారు. తిరుపతి హర్డ్ వేర్ హబ్‌గా తయారైతే కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రీయల్ పార్కులను కేంద్రం ఇస్తే.. రెండు రాయలసీమలో పెట్టామన్నారు. ఓర్వకల్లులో డ్రోన్ సిటీని పెట్టడంతో పాటు కర్నూలు నగరం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఈరోజు హైకోర్టు బెంచ్‌ను కర్నూలులో పెట్టడానికి నేడు సభలో తీర్మానం చేస్తున్నామని.. సభ్యులు ఈ తీర్మానాన్ని సమర్ధించాలని కోరుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. అనంతరం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై చేసిన తీర్మానాన్ని ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

స్వాగ‌తిస్తున్నాం.. ఇది హ‌ర్ష‌ణీయం..

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు తీర్మానాన్ని మంత్రి ఎండీఫరూక్‌ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వవిప్, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ప్రయత్నం ఎంతో ఆనందించదగ్గ పరిణామమన్నారు. వైసీపీ వచ్చాక మూడు రాజధానులు పేరుతో కర్నూలులో న్యాయ రాజధాని అని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. రాయలసీమ వాసులను నిలువునా మోసం చేశారని మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. అప్పట్లో 22మంది ఎంపీలున్నా హైకోర్టు తరలింపుకు ఎలాంటి చర్య చేయలేదన్నారు. న్యాయ రాజధాని కర్నూలు అని జగన్ అంటారని.. అదే జగన్ ఏపీ జుడిషియల్ అకాడమీని మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నట్టు జీవో ఇచ్చారని తెలిపారు. జగన్ రాయలసీమ ద్రోహిగా మిగిలి పోయారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement