Thursday, December 12, 2024

AP | డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా ఏపీ.. మంత్రి నారాయణ

ఉమ్మడిగుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2025 అక్టోబర్ 2 నాటికి వ్యర్ధాలను సమర్దవంతంగా నిర్వహణ చేయడం ద్వారా డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారథ్యంలో కృషి చేస్తామని, త్వరలో కాకినాడ, నెల్లూరుల్లో, కడప, కర్నూల్, అనంతపురం దగ్గర వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. మంగళవారం స్వచ్చాంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, చిలకలూరిపేట శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, స్వచ్ఛాంద్ర కార్పోరేషన్ ఎండి అనిల్ కుమార్ రెడ్డి, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, జిందాల్ ఏపి ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) ఎంవి చారి, అధికారులతో కలిసి చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం కొండవీడు గ్రామ పంచాయితీ పరిధిలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ని పురపాలక అండ్ పట్టణాభివృద్ధి మంత్రి సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న వ్యర్ధాల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, 2025లో గాంధీ జయంతి నాటికి డంపింగ్ యార్డ్ లు లేకుండా సమర్దవంతంగా వ్యర్ధాలను నిర్వహణ చేయడానికి ప్రత్యేక ప్రణాలికలు సిద్దం చేస్తున్నామన్నారు. ప్రజల మీద గత ప్రభుత్వం విధించిన చెత్త పన్నుని చట్టపరంగా రద్దు చేసి, చెత్తని సమర్దవంతంగా నిర్వహణ చేయడం ద్వారా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2014-19 మధ్యలో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పై వివిధ రాష్ట్రాలు, దేశాల్లో స్టడీ చేసి, ఉత్తమ విధానాలతో ఆంధ్రప్రదేశ్ లో 10ప్రాంతాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందని, అందులో భాగంగా గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు స్థల సేకరణ జరగడం, ప్లాంట్ల నిర్మాణ పనులు వేగంగా చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు.

తదుపరి ప్రభుత్వం మారిన తర్వాత చెత్త మీద పన్నులు విధించి ప్రజలపై భారాలు వేయడంపై చూపిన శ్రద్ధ చెత్త నిర్వహణపై చూపకపోవడం, చెత్త నిర్వహణకు దోహదం చేసే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ల నిర్మాణంపై దృష్టి సారించకపోవడం వలన రాష్ట్రంలో సుమారు 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త నిల్వలు పేరుకుపోయాయన్నారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే గత ప్రభుత్వం పోగుచేసిన లెగసి వ్యర్ధాలను క్లియర్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి రోజు సుమారు 6890 మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు ఉత్పత్తి జరిగితే, అందులో ఉమ్మడి గుంటూరు జిల్లాలో, విశాఖపట్నంలో జిందాల్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్లాంట్ ల్లో 2160 టన్నుల వ్యర్ధాలను (31 శాతం) ట్రీట్ మెంట్ చేస్తున్నారన్నారు. ప్లాంట్ల పరిధిలోని 50 నుండి 60 కిలోమీటర్ల పరిధిలోని కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ, నగర పంచాయితీల్లో వ్యర్ధాల సమర్ధ నిర్వహణకు మార్గం సుగమమైందన్నారు.

- Advertisement -

త్వరలో కాకినాడ, నెల్లూరు, కడప, కర్నూల్, అనంతపురం దగ్గర వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాబోయే 3ఏళ్ల కాలంలో రాష్ట్రంలోని 123 మునిసిపాలిటీల్లో సాలీడ్, లిక్విడ్ వేస్ట్ నిర్వహణ, త్రాగునీరు, రోడ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో అమృత్-2, ఏఐఐబి నిధుల వినియోగంపై నిర్లక్ష్యం వలన కేంద్ర ప్రభుత్వం నుండి అందే నిధులు సక్రమంగా అందలేదని, త్వరలో వాటి సద్వినియోగంపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ని చాలా సమర్దవంతంగా నిర్వహిస్తున్నారని, ప్లాంట్ వలన విజయవాడ, గుంటూరు, మంగళగిరి తాడేపల్లి 3 కార్పోరేషన్లు, సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరిపేట, బాపట్ల, పొన్నూరు, తెనాలి 6 మున్సిపాలిటీల్లో ఉత్పన్నమవుతున్న వ్యర్ధాలు, డంపింగ్ యార్డ్ ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు.

స్వచ్చాంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ మాట్లాడుతూ… భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించేందుకు ఎంతో ముందు చూపుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, మున్సిపల్ మంత్రి నారాయణ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. వందల టన్నుల వ్యర్ధాలను ప్రాసెసింగ్ చేస్తున్నా చుట్టు పక్కల ప్రజలకు ఏవిధమైన సమస్య లేకుండా ప్లాంట్ లను నిర్వహిస్తున్నారన్నారు. ప్లాంట్ నిర్వహణ సమర్ధతను గుర్తించి కాలుష్య నియంత్రణ మండలి అవార్డులను కూడా జిందాల్ కి అందించిందన్నారు. ఇటువంటి ప్లాంట్ లు ప్రతి జిల్లాలో నిర్మాణం చేయడం ద్వారా రోజురోజుకి పెరుగుతున్న వ్యర్ధాల నిర్వహణకు పరిష్కారం దొరుకుతుందన్నారు. భవిష్యత్ లో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ లో రోల్ మోడల్ గా ఆంధ్రప్రదేశ్ నిలిచేలా 2047 విజన్ డాక్యుమెంట్ లో కూడా ముఖ్యమంత్రి పొందుపరిచారని తెలిపారు.

చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా వ్యర్ధాల ద్వారా గంటకు 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ, రోజుకి 12వందల టన్నుల వ్యర్ధాలను ప్రాసెసింగ్ చేసే జిందాల్ ప్లాంట్ ఏర్పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతకు తార్కాణమన్నారు. తడి, పొడి వ్యర్ధాలను కూడా ప్రాసెస్ చేయడం జిందాల్ ప్లాంట్ ప్రత్యేకత అని, కాలుష్య నియంత్రణ, ప్రజారోగ్య రక్షణకు ప్లాంట్ లు దోహదపడుతున్నాయన్నారు.

గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ.. జిందాల్ ప్లాంట్ కు గుంటూరు నగరపాలక సంస్థ నుండి ప్రతిరోజు సరాసరి 317టన్నుల వ్యర్ధాలను తరలిస్తున్నామన్నారు. దీని వలన నగరంలో ఉత్పన్నమవుతున్న వ్యర్ధాలను వెంటనే అదే రోజు డిస్పోజ్ అవ్వడం వలన పర్యావరణహితంగా ఉంటుందన్నారు. తొలుత జిందాల్ ప్లాంట్ లోని టిప్పింగ్ ఫ్లోర్, గ్రాప్ కంట్రోల్ రూమ్, బాయిలర్స్, ప్లూ గ్యాస్ క్లీనింగ్ సిస్టం, డీసిఎస్ కంట్రోల్ రూమ్ లు, వాటి పనితీరును జిందాల్ ఏపి ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) ఎంవి చారి వివరించారు. పర్యటనలో గుంటూరు నగరపాలక సంస్థ సిఎంఓహెచ్ డాక్టర్ శోభారాణి, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, ఈఈ సుందర్ రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement