ఒంగోలు, (ప్రభ న్యూస్) : ఆర్.బి.కెలలో ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పారు. రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జెసిలతో మంగళవారం ఆమె వీడియో సమావేశం ద్వారా మాట్లాడారు. ధాన్యం కొనుగోలుపై మిల్లర్ల పాత్ర లేకుండా నేరుగా రైతుల నుంచి ధాన్యం సేకరించడానికి ప్రభుత్వం నూతన విధానాన్ని అమలులోకి తెచ్చిందని పూనం మాలకొండయ్య వెల్లడించారు. ఇప్పటి వరకు రైతుల పేర్లతో మిల్లర్లు చేస్తున్న మాయాజాలాన్ని ప్రభుత్వం అరికటుడుతుందన్నారు.
ఈ క్రాప్‌లో పంట నమోదు చేసుకున్న రైతులు దిగుబడి రాగానే ఆర్.బి.కెల వద్ద పంట కొనుగోలుకు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. అలా పేర్లు నమోదు చేసుకున్న రైతుల పొలం వద్దకే ధాన్యం కొనుగోలు కేంద్రంలోని సిబ్బంది వెళ్లాలని చెప్పారు. పొలం వద్దనే ధాన్యం నాణ్యత, తేమశాతాన్ని, పంట దిగుబడి పరిశీలించిన తదుపరి రైతులకు టోకెన్లు ఇస్తారని ఆమె వివరించారు. నిర్ణయించిన తేదిలలో తమ ధాన్యాన్ని పొలం వద్ద లేదా ఆర్.బి.కెల వద్ద విక్రయించుకునే అవకాశం రైతులకే కల్పిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఖరీఫ్ సీజన్‌లో ప్రారం భించనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ కోసం జిల్లా స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకోవాలన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారిస్తున్నందున కేంద్రాలను పక్కాగా నేడపాలన్నారు. రైతు భరోసా కేంద్రాల వద్ద డి.సి.ఎమ్.ఎస్., వెలుగు సిబ్బంది ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు నడపాలని పూనం మాలకొండయ్య తెలిపారు. ధాన్యం నాణ్యత, రైతులు సాగు చేసిన పంట పరిమాణం ఆధారంగా ఆర్.బి.కెల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎ, బి, సి, గ్రేడింగ్ విధానంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి ఆర్.బి.కె వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బందిని నియమించాలని, వారు రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం మిల్లుకు చేరే వరకు సరఫరాల సంస్థ సిబ్బంది విధిగా పరిశీలన ఉండాలన్నారు.
గత ఏడాదికంటే క్వింటా ధాన్యంపై అదనంగా రూ. 72లు ప్రభుత్వం పెంచిందన్నారు. క్వింటా గ్రేడ్ -ఏ ధాన్యం ధర రూ. 1,960లు, కామన్ రకం ధర రూ. 1940లుగా ప్రభుత్వం మద్థతు ధర నిర్ణయిం చిందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రైతుల నుంచి ధాన్యం సేకరించాలని ఆమె పలు సూచనలు చేశారు. కేంద్రాలకు అవసరమైన గోతాలు, హమాలీలను సిద్ధం చేసుకోవాలన్నారు. వరి పంట జిల్లాలో 68,403 ఎకరాలలో సాగు చేస్తున్నట్లు రైతులు ఈ క్రాపింగ్‌లో నమోదు చేసుకున్నారని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ (ఆర్.బి.అండ్.ఆర్) జె. వెంకట మురళి, పౌర సరఫరాల శాఖ అధికారి పి. సురేష్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ నారదముని, వ్యవసాయశాఖ జె.డి. శ్రీనివాసరావు, మార్కెటింగ్ శాఖ ఎ.డి. ఉపేంద్రకుమార్, డి.ఆర్.డి.ఎ. పి.డి. బి. బాబురావు, సహకార శాఖ అధికారి పి. రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.