Friday, November 22, 2024

AP – సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తూనే పండుగ చేసుకుందాం – చంద్రబాబు పిలుపు

విజయవాడలో చవితి వేళ ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. వదర బీభత్సం నుంచి విజయవాడ క్రమేణా బయట పడుతోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులకు అండగా పలువురు ముందుకు వస్తున్నారు.

అన్ని రంగాల ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. వరద బాధితులు నగరం వీడి వెళ్లారు. వరదలు ముంచెత్తడంతో వినాయకచవితి పండగ సందడి కనిపించడంలేదు. ఇదే సమయంలో పండుగ వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక పిలుపు నిచ్చారు.

వరదల వేళ విజయవాడలో కృష్ణమ్మ, బుడమేరు వరదలకు విజయవాడ వన్‌టౌన్‌ ప్రాంతం అతలాకుతలం కావడంతో ఆ ప్రాంతంలో ఏటా కనిపించే వినాయక చవితి కోలాహలం ఇప్పుడు కనిపించడంలేదు. ఇంకా వరద ముంపులోనే ఆ ప్రాంతాలు కొనసాగుతుండడం విద్యుత్తు సరఫరా లేకపోవడం, ఇళ్లు అపరిశుభ్రంగా ఉంటోన్న తరుణంలో విఘ్నవినాశకా తమ అవస్థలు తీర్చాలని వేడుకుంటున్నారు.

- Advertisement -

పండుగ సందడి స్తబ్ధుగానే ఉంది. వరద దెబ్బకు పంటలు నష్టపోవడంతో పండ్లు, పూల ధరలకు రెక్కలు వచ్చాయి. స్తబ్దుగా విజయవాడ ఏటా వినాయక విగ్రహాలు, పండ్లు, పూలు, పత్రిల కొనుగోలుతో సందడిగా ఉండే మార్కెట్‌, ప్రధాన రహదారులు వరదల వల్ల బోసిపోయి కనిపిస్తున్నాయి. పూలు, పండ్లు దుకాణాల వద్ద ఓ మోస్తరు రద్దీ కనిపిస్తోంది.. పత్రి, పూలు, పండ్ల ధరలు బాగా పెరిగాయి. వీధుల్లో పందిళ్లు చాలా వరకు తగ్గిపోయాయి. గణపతి నవరాత్రులకు సిద్ధమవుతున్న సమయంలో విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తి బీభత్సం సృష్టించడంతో ప్రజలు ఇంకా కష్టాల నుంచి తేరుకోలేదు. వరద ప్రభావం లేనిచోట్ల ఒకింత పండుగ సందడి కనిపిస్తున్నా సాదాసీదాగానే వ్యాపారాలు సాగుతున్నాయి.

చంద్రబాబు సందేశం

ఇదే సమయంలో విజయవాడలోనే మకాం వేసి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు పండుగ సందేశం ఇచ్చారు. వాడవాడలా చవితి పందిళ్లతో కళకళలాడాల్సిన సమయంలో వచ్చిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు విజయవాడ ప్రజలను తీవ్ర కష్టాల పాలుచేశాయని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వారి బాధలు తీర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని, ప్రజలు సాధారణ జీవితం పొందేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పండుగ చేసుకుంటూనే సహాయక కార్యక్రమాలు కొనసాగిద్దామని పిలుపునిచ్చారు

Advertisement

తాజా వార్తలు

Advertisement