Friday, November 22, 2024

ఏపి, తెలంగాణ కు మరో వారధి.. సోమశిలపై బ్రిడ్జికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

తెలుగు రాష్ట్రాలకు మరో జాతీయ రహదారి అందుబాటులోకి రాబోతోంది. ఈ జాతీయ రహదారి నిర్మాణం కోసం అధికారులు ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేశారు. ముఖ్యంగా తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా, నంద్యాల బైపాస్‌ రోడ్డు వరకు ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి రూపొందించిన ప్రణాళికను కేంద్ర ఉపరితల రవాణా శాఖ సమ్మతించింది. ఈ మేరకు రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను సెంట్రల్‌ అప్రూవల్‌ జిపిఆర్‌ ఫర్ న్యూ నేషనల్‌ హైవే సంస్థ ఆమోదిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రణాళిక ప్రకారం.. ఏపీ, తెలంగాణలను అనుసంధానిస్తూ 174 కి.మీ. మేర జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-167కె)ను రూ.600 కోట్లతో నిర్మిస్తారు. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి సమీపంలోని కొట్రా జంక్షన్‌ నుంచి ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల వరకు నిర్మించాలని నిర్ణయించారు. ఏపీ పరిధిలో కర్నూలు జిల్లాలోని ఎర్రమఠం, ముసలి మడుగు, ఆత్మకూరు, వెలుగోడు, సంతజుటూరు, కరివెనపై బైపాస్‌ రోడ్లు నిర్మిస్తారు.

అలాగే తెలంగాణ పరిధిలో కల్వకుర్తి, తాడూరు, నాగర్‌ కర్నూలు, కొల్లాపూర్‌లలో బైపాస్‌ రోడ్లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై రూ.600 కోట్లతో ఓ వంతెననూ నిర్మిస్తారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా సిద్ధేశ్వరం.. తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల మధ్య దాదాపు 2 కి.మీ. మేర ఈ వంతెన నిర్మాణం జరుగుతుంది. కేంద్రం డీపీఆర్‌ను ఆమోదించడంతో త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టి రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాలని భావిస్తున్నామని ఎన్‌హెచ్‌ఏఐ అధికార వర్గాలు తెలిపాయి. ఈ జాతీయ రహదారి పూర్తయితే హైదరాబాద్‌- తిరుపతి మధ్య 42 కిలో మీటర్ల దూరం తగ్గుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి తిరుపతికి కర్నూలు మీదగానే వెళ్ళాలి. ఈ ప్రాజెక్టు పూర్తయితే కల్వకుర్తి, కొల్లాపూర్ మీదుగా నంధ్యాల వెళ్లి అక్కడ కర్నూలు- తిరుపతి జాతీయ రహదారికి అనుసంధానం అయ్యే హైవే మీదుగా వెళ్లిపోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌- నంద్యాల మధ్య దూరం 296 కిలోమీటర్లు, కొత్త జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే అది 254 కిలోమీటర్లకు తగ్గుతుంది. అంతేకాకుండా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న సోమశిల వంతెన నిర్మాణం కూడా పూర్తి కానుంది. వీటిని జాతీయ రహదారి-40 జంక్షన్‌కు అనుసంధానం చేయనున్నారు.

ముఖ్యంగా సోమశిల సమీపంలో కృష్ణానదిపై రీ అలైన్‌మెంట్‌ బ్రిడ్జి నిర్మిస్తారు. కర్నూల్‌ జిల్లాలోని ఎర్రమఠం, ముసలి మడుగు, ఆత్మకూరు, వెలుగోడు, సంతజుటూరు, కరివెనపై నంద్యాల బైపాస్‌ రోడ్ల వరకు బైపాస్‌ల రహదారుల నిర్మాణాలు చేపట్టనున్నట్లు- ఉత్తర్వులలో పేర్కొన్నారు. నంద్యాల బైపాస్‌ చివరలోని జాతీయ రహదారి-40 జంక్షన్‌కు దీన్ని అనుసంధానం చేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే రెండు రాష్ట్రాల్రను కలుపుతూ కొత్తగా నిర్మిస్తున్న కొల్లాపూర్‌(167కే) జాతీయ రహదారి దాదాపు 173.73 కిలోమీటర్ల పొడవు ఉండనుంది. ఈ రహదారిపై 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే విధంగా నిర్మాణం చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మండల, నియోజకవర్గ కేంద్రాల్లో బైపాస్‌, రీ అలైన్‌మెంట్ల నిర్మాణాలూ ఉంటాయని అధికారులు తెలిపారు. కొల్లాపూర్‌ (167కే) జాతీయ రహదారి నిర్మాణం నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి సమీపంలోని కొట్రా జంక్షన్‌ నుంచి ప్రారంభమవుతుంది. కల్వకుర్తి, తాడూరు, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌ ప్రాంతాల్లో బైపాస్‌ రోడ్లు నిర్మించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement