పాత వాసనలు వీడాలని హితవు
సస్పెండ్ చేసే విధంగా ప్రవర్తించవద్దు
పాయకారావుపేటో ఉచిత గ్యాస్ పథకాన్నిప్రారంభించిన అనిత
పాయకారావుపేట – అధికారుల్లో ఇంకా పాత వాసన ఉందని, వెంటనే దానిని విడనాడాలని సూచించారు హోం మంత్రి వంగలపూడి అనిత…. తాను ఎక్కడ ఉన్నా.. ఏ అధికారి ఎలా పని చేస్తున్నారో డేటా ఉంటుందని తెలిపారు. తాను ఎప్పుడు అధికారులను సస్పెండ్ చేసే విధంగా చర్యలు తీసుకోలేదని.. అలాంటి పరిస్థితిని తీసుకురాకండని అధికారులకు సూచించారు. అధికారులు తప్పు చేస్తే ఉపేక్షించేంది లేదని అన్నారు. ఎవ్వరైనా అధికారులు అవినీతి చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో పంచాయితీ రాజ్ ప్రభుత్వ గెస్ట్ హౌస్ వద్ద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీని అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
గత ఐదు సంవత్సరాలుగా గ్యాస్ పొయ్యి వెలిగించాలి అంటే మహిళలు భయపడేవారని పేర్కొన్నారు. గతంలో గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు.. అప్పటిలో మహిళల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు దీపం పథకం ప్రవేశపెట్టారని అనిత అన్నారు. ఇప్పుడు మరల దీపం-2 పథకం ప్రవేశపెట్టి, మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర ఖజనాలో ప్రస్తుతం డబ్బులు జీరో అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. త్వరలో పాయకరావుపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని చెప్పారు. పాయకరావుపేట నియోజకవర్గంలో తాము వేసిన రోడ్లు తప్ప ఒక్క రోడ్డు వేయలేదని ఆరోపించారు. త్వరలో పాయకరావుపేటలో డబుల్ రోడ్డు వేస్తాం.. పాయకరావుపేటకు ఒక గుర్తింపు తీసుకువస్తామని అనిత అన్నారు. వైసీపీ పాలనలో గ్రామ సర్పంచ్‌లకు చేతులకు సంకేళ్ళు వేశారని దుయ్యబట్టారు. ఎన్డీయే ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని హోంమంత్రి అనిత తెలిపారు.