ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి : వైసీపీ నేతలపై దాడులు జరిగాయా? లేదా? అని ప్రశ్న పంపించి.. అసెంబ్లీకి రాకుండా పోతే ఎలా అని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యంగాస్త్రాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నాల్గవ రోజు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఈ సందర్బంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. వైసీపీ సానుభూతి పరులపై దాడులు జరుగుతున్న విషయం వాస్తవమేనా అని వైసీపీ వాళ్లు ప్రశ్నవేసి.. సభకు రాలేదని ఎద్దేవా చేశారు. నిజానికి టీడీపీ వాళ్లను చంపి అదేదో తాము చేసినట్టు ఆరోపిస్తున్నారని, అధికారం కోల్పోయి.. 11 సీట్లు సాధించాక టీడీపీ కార్యకర్తలను చంపి ఢిల్లీవెళ్లి అక్కడ దీక్షచేయడం ఏంటని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నలుగురు చనిపోతే ముగ్గురు టీడీపీకి చెందిన వారు ఉన్నారని, దానికి సంభందించి కేసు నెంబర్లతో సహ వెల్లడించామని హోంమంత్రి తెలిపారు.
హత్యలు ఎక్కడ జరిగాయో వివరాలు ఇవ్వండి..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 36 రాజకీయ హత్యలు జరిగాయని వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారని, వారి పేర్లు చెప్పమంటే మాట్లాడలేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అసెంబ్లీకి 36 మంది వివరాలు ఇవ్వవచ్చుకదా.. అలా చేయకుండా ఢిల్లీ ఎందుకు వెళ్ళారని ఆమె ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఆత్మకూరుకు ప్రతిపక్షనేత చంద్రబాబు వెళ్ళాలనుకుంటే ఆయన ఇంటి గేటుకు తాళ్లు కట్టారని, పవన్ కళ్యాణ్ అమరావతి రైతుల వద్దకు వెళితే ముళ్లకంపలు వేశారని, యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌కు స్టూల్ ఎక్కి నిల్చోవడానికి కూడా అనుమతి ఇవ్వలేదని హోంమంత్రి మండిపడ్డారు.
వివరాలు ఇవ్వకుంటే యాక్షన్ తీసుకుంటాం..
వైసీపీ ప్రభుత్వం మీడియాతో పాటు ఎవ్వరినీ వదలలేదు అనే విషయం మర్చి పోకూడదని.. గత అయిదేళ్లల్లో రాష్ట్రంలో ఇలాంటి భయానక వాతావరణాన్ని సృష్టించారని మంత్రి అన్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్‌ను అడుగుతున్న.. 36 మంది చనిపోయారు అని అంటున్నారు. దానికి ఆయన సభకు వచ్చి ఆ వివరాలు ఇవ్వాలని హోంమంత్రి వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. తాము చర్యలు తీసుకుంటామని.. అయితే జగన్ ఇచ్చిన వివరాలు తప్పు అని తేలితే ప్రభుత్వం తీసుకునే చర్యలకు భాద్యులవుతారని ఆమె హెచ్చరించారు. లోకేష్ రెడ్ బుక్ గురించి వైసీపీ కార్యకర్తలే పట్టించుకోవడం లేదని.. మరి జగన్‌కు ఎందుకు నిద్దర పట్టడం లేదో చెప్పాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.