Thursday, November 21, 2024

AP Anganwadi:స‌మ‌స్య‌లను పరిష్కరించారా… మంత్రుల ఇండ్ల ముట్ట‌డి

తమ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాంటూ అంగ‌న్‌వాడీలు మంత్రుల ఇండ్ల‌ను ముట్టించారు. 19రోజులుగా స‌మ్మె చేస్తున్న ప్ర‌భుత్వం త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేదంటూ మంత్రుల ఇండ్ల ముట్టడికి యత్నించారు. దీంతో అంగ‌న్‌వాడీల‌ను పోలీసులు అడ్డుకొని ఠాణాకు త‌ర‌లించారు.

గుంటూరులోని శ్యామలనగర్‌లో మంత్రి విడదల రజిని ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. దాదాపు నాలుగు నియోజకవర్గాల నుంచి అంగన్వాడీలు తరలివచ్చారు. ప్రభుత్వం స్పందించే వరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తమకు కనీస వేతనాలు పెంచి గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో అంగన్వాడీల సమస్యలను సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా మంత్రి రజని తెలిపారు. అంగన్వాడీలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అందరి సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు.

ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంత్రి సురేష్‌ ఇంటిని సైతం అంగన్వాడీలు ముట్టడించారు. మంత్రి సురేష్‌ ఇంటి ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, అంగన్వాడీల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. అలాగే ఒంగోలులోని మంత్రి సురేష్‌ క్యాంపు కార్యాలయాన్ని దిగ్బంధించారు.

మంత్రి ఉష శ్రీచరణ్‌ ఇంటి ముట్టడికి కూడా అంగన్వాడీలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళుతున్న అంగన్వాడీలను నాలుగో పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. శివారు ప్రాంతంలో వాహనాలను నిలిపి అంగన్వాడీలను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. దీంతో అంగన్వాడీలు స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముట్టడికి బయల్దేరిన అంగన్వాడీలను వెస్ట్‌ చర్చి కూడలి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపైనే బైఠాయించి నినాదాలు చేశారు. ఈ క్రమంలో రాకపోకలను పోలీసులు దారిమళ్లించారు. విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ముట్టడికి అంగన్వాడీలు యత్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement