ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి : ఏపీ పోలీసు శాఖలో సేవకు సీనియర్ ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్డా రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన సీఆర్పీఎఫ్ ఐజీగా ఉన్నారు. ఆయన 1998 ఏపీ కేడర్ ఐపీఎస్ ఆఫీసర్. ఐపీఎస్ చంద్ర లడ్డాను ఏపీ సర్వీస్‌లోకి పంపించాలని సీఎం చంద్రబాబు రెండు రోజుల కిందటే కేంద్రానికి లేఖ రాశారు. తక్షణమే స్పందించిన కేంద్రం వెంటనే ఆయనను ఏపీ సర్వీసులకు బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఐపీఎస్ మహేశ్ చంద్ర లడ్డాను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా సీఎం చంద్రబాబు నియమిస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే అదే నిజమైంది… ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపద్యంలో ఇంటెలిజెన్స్ విభాగంలో అడిషనల్ డెరైక్టర్ జనరల్ గా నియమిస్తూ ఎపి ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నేడు ఉత్తర్వులు జారీ చేసారు. ప్రస్తుతం ఈ స్థానం లో విధులు నిర్వహిస్తున్న విశ్వజీత్ కుమార్ ను బదిలీ చేసారు
ఎక్కడా తగ్గది లే.. అదే లడ్డా నైజం
2019లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన కోడి కత్తి ఘటనలో విశాఖ సిటీ పోలీసు కమిషనర్‌గా చంద్ర లడ్డా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత విశాఖ నుంచి నేరుగా సెంట్రల్ సర్వీసులకు వెళ్లారు. ఇప్పుడు ఆయనను కేంద్రం నుంచి ఏపీకి సీఎం చంద్రబాబు తీసుకొచ్చారు. రాజస్థాన్‌కు చెందిన మహేష్‌చంద్ర లడ్డా ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఆ తర్వాత 1998 ఏపీ బ్యాచ్‌కు చెందిన ఆయన, విశాఖలో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ప్రకాశం, గుంటూరు, నిజామాబాద్ జిల్లాలకు ఎస్పీగా పని చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మహేష్ చంద్ర లడ్డాపై నక్సల్స్ దాడి జరిగింది. ఆ ఘటనలో తృటిలో తప్పించుకున్నారు. గుంటూరు ఎస్పీగా ఉన్న సమయంలో రౌడీయిజంపై ఉక్కుపాదం మోపడమే కాదు, క్లబ్‌లపై దాడులు చేశారు. ఆ తర్వాత విజయవాడ డిప్యూటీ కమిషనర్‌గా పని చేశారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆయనను ఏరి కోరి తీసుకొస్తున్నారు. ఆయనకు కీలక నిఘా ఛీప్ బాధ్యతలు అప్పగించటం ఖాయమని ప్రచారం జరుగుతోంది.