స్థానిక క్రికెటర్లను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నిర్వహిస్తున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) మూడో సీజన్ జూన్ 30 నుంచి జూలై 13 వరకు జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తరహాలో జరగనున్న ఈ పోటీలో ఆరు జట్లు బరిలో నిలుస్తాయి.
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-3కి సంబంధించిన ప్రణాళికలను ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్ గోపీనాథ్ రెడ్డి వెల్లడించారు. ఎంపిక చేసిన పూల్ నుండి ప్రతి ఫ్రాంచైజీ ఒకరిద్దరు ఆటగాళ్లను తీసుకుని కొత్త క్రికెటర్లకు అవకాశం కల్పించేందుకు ‘ఏపీఎల్ రైజింగ్ స్టార్’ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఇది క్రికెటర్ల కెరీర్ను మెరుగుపరుస్తుందని.. వారికి విలువైన ఎక్స్పోజర్ను అందిస్తుందని ఆయన అన్నారు.
APL వేలం ప్రక్రియకు సన్నాహకాలు జరుగుతుండగా.. 452 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారని తెలిపారు. వేలంలో ఎంపికైన ఆటగాళ్లు కనీసం రూ. 25,000 నుండి గరిష్టంగా రూ.1 లక్ష వరకూ అందుకోనున్నారు. స్థానిక క్రికెటర్లను ప్రోత్సహించేందుకు సంఘం కట్టుబడి ఉందని గోపీనాథ్ రెడ్డి ఉద్ఘాటించారు. APL అనేది నాన్ కమర్షియల్ వెంచర్ అని.. BCCIకి చెందిన అవినీతి నిరోధక బృందం అన్ని లావాదేవీలను పర్యవేక్షిస్తుందన్నారు.