అమరావతి – ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పోలీసు ఉన్నతాధికారులపై ఎలక్షన్ కమిషన్ వేటు వేస్తోంది. ఇప్పటికే డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డిపై వేటువేసి అతని స్థానంలో హరీష్ గుప్తాను నియమించింది. తాజాగా రాష్ట్రంలో మరో సీనియర్ పోలీసు అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్ఎస్ అమ్మిరెడ్డిపై బదిలీ వేటు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. విధుల నుంచి వెంటనే రిలీవ్ అవ్వాలని ఈసీ ఆదేశించింది. కింది స్థాయి అధికారులకు బాధ్యలు అప్పగించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డికి ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలయ్యే వరకు ఎన్నికలకు సంబంధించిన విధులేవీ ఆయనకు అప్పగించొద్దని స్పష్టం చేసింది. ఇవాళ రాత్రి 8 గంటల లోపు ముగ్గురు అధికారుల పేర్లతో ప్యానల్ పంపాలని ఆదేశించింది.
అమ్మిరెడ్డిపై బదిలీ వేటు అందుకే..
డీఐజీ అమ్మిరెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్ష కూటమి నేతలు కూడా ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు చేశారు. అధికార పార్టీతో అంటకాగుతున్నారని, ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా ఈసీకి చూపించారు కూటమి నేతలు. దీంతో విచారణ జరిపిన ఈసీ.. అమ్మిరెడ్డిని విధఉల నుంచి తొలగించింది. పోలింగ్ పూర్తయ్యే వరకు ఆయనకు ఎన్నికల విధులు అప్పగించొద్దని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.