Wednesday, November 20, 2024

AP – ఇక వాట్స్ ప్ ద్వారా స‌ర్టిఫికెట్స్ – మెటాతో ఒప్పందం: నారా లోకేష్

అమ‌రావ‌తి – కుల ధృవీకరణ సర్టిఫికెట్ కావాలంటే మూడు గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీసులు, న‌లుగురు వ‌ర‌కూ వివిధ హోదాల అధికారులు, సిబ్బంది చుట్టూ ఓ వారం రోజులు తిర‌గాల్సిందే. క‌రెంటు, న‌ల్లా, ఇంటి ప‌న్ను, ఇత‌ర‌త్రా బిల్లులు చెల్లించాలంటే సంబంధిత కార్యాల‌యాల్లో ఇప్ప‌టికీ ఎడ‌తెగ‌ని క్యూలలో నిరీక్ష‌ణ త‌ప్ప‌దు. నాడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో ఈ స‌ర్టిఫికెట్ల క‌ష్టాల‌ను యువ‌త ఏక‌రువు పెట్టారు.

వాట్సాప్ లో ఒక టెక్ట్స్ మెసేజ్ చేస్తే ఇంటికి, మ‌నిషికి అవ‌స‌ర‌మైన స‌మ‌స్త వ‌స్తువులు వ‌స్తున్నప్పుడు, సేవ‌లు అందుతున్న‌ప్పుడు.. ఒక స‌ర్టిఫికెట్ కోసం ఆఫీసులు చుట్టూ ప‌నులు మానుకుని మ‌రీ తిర‌గాల్సిన ప‌రిస్థితికి చెక్ పెడ‌తామ‌ని, ప్ర‌భుత్వంలోకి రాగానే… వాట్సాప్ ద్వారా ప‌ర్మినెంట్ స‌ర్టిఫికెట్ పొందే అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
ఏపీలో పౌర సేవలు మరింత సులభతరం కానున్నాయి. ఈ మేరకు మెటా- ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఢిల్లీలోని 1 జన్‌పథ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మెటా సంస్థ ప్రతినిధులు రవిగార్గ్‌, నటాషా, ఆర్టీజీఎస్‌ సీఈవో దినేశ్ లు లోకేష్ స‌మ‌క్షంలో నేడు ఒప్పంద ప‌త్రాల‌ను మార్పుకున్నారు..

- Advertisement -

ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. యువగళం హామీలు నెరవేర్చడంలో మెటాతో ఎంవోయూ చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు. ”విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ సర్టిఫికెట్ల కోసం పడుతున్న కష్టాలు యువగళం పాదయాత్ర సందర్భంగా ప్రత్యక్షంగా చూశా. మొబైల్‌ ద్వారానే ఆయా సర్టిఫికెట్లు అందిస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చా. ఇచ్చిన హామీ మేరకు వాట్సప్‌ ద్వారానే వివిధ రకాల సర్టిఫికెట్లు, పౌరసేవలు అందించేలా మెటాతో ఒప్పందం చేసుకున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని సేవలు ఆన్‌లైన్‌లో అతి సులువుగా, పారదర్శకంగా, అతి వేగంగా పొందే ఏర్పాట్లు చేస్తాం” అని తెలిపారు.

ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చాలా సంతోషం: మెటా ఇండియా

మెటాలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సేవలను వినియోగించుకుని వాట్సప్‌ ద్వారా ఏపీ ప్రజలకు పౌర సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని మెటా ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ సంధ్యా దేవనాథన్ తెలిపారు. ప్రజలు తమకు కావాల్సిన సేవలు పొందేందుకు వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌, వాట్సప్‌ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ ఉంటుందన్నారు. డిజిటల్ టెక్నాలజీని వాడుకుని ఏపీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు మరిన్ని ఉత్తమ సేవలు అందించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement