ఒకరి పరిస్థితి విషమం
నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో ఘటన
స్పందించిన హోం మంత్రి అనిత
మెరుగైన వైద్య సేవలకు ఆదేశం
అంధ్రప్రభ – అనకాపల్లి స్మార్ట్ – అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో కలకలం రేగింది. నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన రోగులు, బాలింతలు రెండు మూడు రోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు. మంగళవారం రాత్రి విధుల్లో ఉన్న వైద్యురాలు జయలక్ష్మి ఆధ్వర్యంలో నర్సులు వీరికి ఇంజక్షన్లు ఇచ్చారు. కాసేపటికే పై అంతస్తులో చికిత్స పొందుతున్న రోగులు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. కొందరికి చలి జ్వరం వచ్చింది.
వీరిలో ఐదుగురు చిన్నారులూ ఉన్నారు. విషయం తెలుసుకున్న వైద్యాధికారి వీరందరికీ విరుగుడు మందులు ఇస్తూనే పోలీసులు, ఉన్నతాధికారులకు తెలియజేశారు. రోగుల సహాయకులు భారీగా చేరుకోవడంతో అక్కడ ఆందోళన నెలకొంది. హోం మంత్రి వంగలపూడి అనిత కలెక్టర్తో మాట్లాడారు. చివరకు అంబులెన్స్ల్లో 17 మందిని అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో సింహాద్రి అనే రోగి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యాధికారి తెలిపారు. ఇంజక్షన్లు వికటించడంపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు.ఇక వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ది. కాగా, బాధితులంతా నక్కపల్లి జానకయ్యే పేట, వెదుళ్ల పాలెం, తిమ్మాపురం డి ఎల్ పురం, ఉపమాక్ తదితర గ్రామాలకి చెందిన వారని సమాచారం.