( ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో ) – భారతదేశ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య సేవలు చిరస్మరణీయమని.. దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డు, విష్ణుప్రియనగర్ తిరంగా పార్కులో శుక్రవారం జరిగిన 150 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో అతి ఎత్తయిన 418 అడుగుల జాతీయ పతాకం అటారీ-వాఘా సరిహద్దు వద్ద ఉందని.. ఇప్పుడు చారిత్రక ఔన్నత్యం కలిగిన జగ్గయ్యపేటలో 150 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పింగళి వెంకయ్య జాతి గౌరవానికి ప్రతీక అయిన జాతీయ పతాకాన్ని రూపొందించడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. 1918 నుంచి 1921 వరకు జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో పింగళి వెంకయ్య జెండా ప్రస్తావన తీసుకొచ్చారని.. ఎట్టకేలకు మహాత్మా గాంధీ ఆశయాలు, ఆకాంక్షలకు అందిపుచ్చుకొని వెంకయ్య రూపొందించిన జెండా మన జాతీయ పతాకమైందని వివరించారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలను పురస్కరించుకొని నిర్వహించిన ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని.. ఈ సందర్భంగా పింగళి వెంకయ్యకి దేశమంతా ఘన నివాళులు అర్పించినట్లు తెలిపారు. ప్రజల్లో దేశ భక్తిని ఐక్యతను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఇటీవల గొప్పగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. చారిత్రక ఔన్నత్యానికి నిలయంగా ఉన్న జగ్గయ్యపేట ప్రాంతంలో 150 అడుగుల ఎత్తయిన జాతీయ పతాకాన్ని ఏర్పాటుచేయడంలో విశేష కృషిచేసిన శాసనసభ్యులు సామినేని ఉదయభానుకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు.
పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులకు ఘన సత్కారం…
150 అడుగుల జాతీయ పతాక ఆవిష్కరణ మహోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పింగళి వెంకయ్య మనుమడు జీవీఎన్ నరసింహం దంపతులను ఘనంగా సత్కరించారు. అదే విధంగా జగ్గయ్యపేట అభివృద్ధిలో సీఎస్ఆర్ నిధుల ద్వారా భాగస్వాములవుతున్న కేసీపీ సిమెంట్స్, అల్ట్రాటెక్, రామ్‌కో, కొహాన్స్ లైఫ్ సైన్సెస్ తదితర సంస్థల ప్రతినిధులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ సతీమణి సమీర నజీర్, ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), ఎమ్మెల్సీ ఎం.అరుణ్‌కుమార్, జగ్గయ్యపేట శాసనసభ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, జగ్గయ్యపేట మునిసిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. పింగళి వెంకయ్య మనుమడు జీవీఎన్ నరసింహం దంపతులు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. అలాగే 31వ వార్డు కౌన్సిలర్ గింజపల్లి వెంకటరావు, ఆర్డీవో సాయిబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.