అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో తొందరలోనే ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఎలక్ట్రిక్ బస్సులకు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. తిరుపతి నుంచి తిరుమల, తిరుపతి నుంచి సమీప పట్టణాలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు తిప్పనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ఎలక్ట్రిక్ బస్సులను తొందరలోనే ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు చెప్పారు. మెస్సర్స్ ఈవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (మెఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) సంస్థ వీటిని నిర్వహించనుంది. పర్యావరణ కాలుష్యం తగ్గింపు..ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కలిపించేందుకు వీటిని ప్రవేశపెడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు విధానంలో అద్దె ప్రాతిపదికన విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, తిరుపతి పట్టణాల్లో 350 విద్యుత్ బస్సులను నడిపేందుకు నిర్ణయించిన ఆర్టీసీ అధికారులు గతంలోనే టెండర్లు పిలిచారు. ఇందులో ముగ్గురు పాల్గొన్నప్పటికీ ఈవే ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (హైదరాబాద్), మెస్సర్స్ అశోక్ లేలాండ్ (చెన్నై) ఆఖరి వరకు నిలిచారు. వారి ప్రతిపాదనలపై ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది. విజయవాడ, విశాఖపట్టణం, కాకినాడ, గుంటూరు పట్టణాల్లో తిప్పేందుకు నిర్ణయించిన 250 బస్సులకు బిడ్డర్లు తక్కువగా కోట్ చేసినప్పటికీ ప్రతిపాదిత రేట్లు ఎక్కువగా ఉండటంతో ఆర్టీసీ ఆలోచన విరమించుకుంది.
తిరుపతి నుండి తిరుమలకు 50 బస్సులు, తిరుపతి నుండి సమీప పట్టణాలైన కడప, నెల్లూరు, మదనపల్లి, రేణిగుంటకు మరో 50 బస్సులు నడిపేందుకు ఈవే ట్రాన్స్ సంస్థ తక్కువ రేటు కోట్ చేసినప్పటికీ ఇంద్ర డీజిల్ రేటుతో సమానంగా ఉంటేనే కేటాయించేందుకు అధికారులు స్పష్టం చేశారు. ఆఖరిగా ఇంద్ర డీజిల్ బస్సు రేటు-తో ఎలక్ట్రిక్ర్ బస్సులు త్రిప్పేందుకు ఈవే సంస్థ అంగీకరించడంతో కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి గత జూలైలో అధికారులు పంపారు. కేంద్రం నుంచి ప్రతిపాదనలకు ఆమోదం కోసం ఎదురు చూసిన ఈవే సంస్థ విద్యుత్ బస్సుల నిర్వహణకు ఇప్పటి వరకు ప్రారంభించలేదు. రెండు రోజుల కిందట కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం లభించడంతో తొందరలోనే వీటిని ఈవే ట్రాన్స్ సంస్థ రోడ్డెక్కించనుంది. సీఎం జగన్మోహన రెడ్డి వీటిని ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు.