Thursday, September 19, 2024

AP – ప్ర‌తి ఎక‌రానికి రూ.10 వేలు ఇస్తాం … రైతుల అధైర్య‌ప‌డొద్దు: చంద్రబాబు

అన్ని విదాల ఆదుకుంటాం
గ‌త ప్ర‌భుత్వ పాపాలే ఇప్ప‌డు శాపాలయ్యాయి
బెజ‌వాడ‌ను ముంచింది జ‌గ‌న్ అండ్ కోనే
ప్ర‌కాశం బరాజ్ ను కూల్చే కుట్ర కూడా వాళ్ల‌దే
కొల్లేరు వ‌ర‌ద ప్రాంతాల‌లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌
ఏలూరులో రైత‌న్న‌ల‌తో ముఖాముఖి
పోల‌వ‌రం పూర్తి చేస్తామ‌ని హామీ..

ఏలూరు – గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు మనకు ఇప్పుడు శాపాలుగా మారాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. బుడమేరు పట్ల నాటి సర్కారు వహించిన నిర్లక్ష్య ధోరణి విజయవాడకు ముప్పుగా పరిణమించిందని చెప్పారు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా బుడమేరు పూడిక తీయలేదని, గండ్లు పూడ్చలేదని విమర్శించారు. దీంతో భారీ వర్షాలకు విజయవాడను కనీవినీ ఎరగని వరద ముంచెత్తిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

- Advertisement -

ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను నేడు ఆయన పరిశీలించారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలను ఏరియ‌ల్ స‌ర్వే ద్వారా పరిశీలించారు. ఆ త‌ర్వాత రోడ్డు మార్గంలో తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు..

ఆ త‌ర్వాత ఆయన సీఆర్‌రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో వరదలకు నష్టపోయిన రైతులు, వరద బాధితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీలోపు నష్ట పరిహారంపై నిర్ణయం తీసుకుంటామని, వరికి మాత్రం ఎకరానికి రూ. 10 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఉప్పుటేరుపై రెగ్యెలేటర్ నిర్మాణంపై సీరియస్‌గా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు తెలుగుదేశం హయాంలో 72 శాతం పూర్తిచేసామని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ పోలవరాన్ని ముంచేసారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పుడు పోలవరం పూర్తిచేయాలనే ఉద్ధేశ్యంతో కేంద్రంతో మాట్లాడి రూ. 12 వేల కోట్లు తీసుకువచ్చామన్నారు. త్వరలోనే పోలవరం పనులు మొదలుపెడతామని స్పష్టం చేశారు. వరదలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా తీసుకుంటామని, వరదల వలన సాగునీటి సంఘాల ఎన్నికలు ఆలస్యం అయ్యాయని, త్వరలోనే అవి వస్తాయని తెలిపారు. శనివారపుపేట కాజ్‌వే స్థానంలో వంతెన నిర్మాణానికి రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నానని, పెదపాడు మండలంలో లోయేరు వాగు మరమత్తులు చేపడతామని చెప్పారు. వరదల వలన నష్టపోయిన అందరినీ ఆదుకుంటామని స్పష్టం చేశారు. తాను, తన మిత్రుడు పవన్ కళ్యాణ్, బీజేపీలు (కూటమి ప్రభుత్వం) సుపరిపాలన అందిస్తామని, కౌలు రైతుల ఖాతాల్లోకి నేరు ఇన్ పుట్ సబ్సీడీ వేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

బెజ‌వాడ‌ను ముంచింది జ‌గ‌న్ అండ్ కో నే…

గతంలో బుడమేరుకు గండ్లు పడితే వైసీపీ ప్రభుత్వం పూడ్చలేదని విమర్శించారు. బుడమేరు వాగు పరిధిలో గత ప్రభుత్వం అక్రమార్కులను ప్రోత్సహించిందని, అక్రమ కట్టడాలకు తప్పుడు దారిలో అనుమతులిచ్చిందని వివరించారు. కుండపోత వర్షాలు, వరదలకు వాతావరణ మార్పులు కారణమని చెప్పారు. అయితే, ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వరదల ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు.

ఆ బోట్లు వాళ్లవే..
ఎన్నికల్లో ఓడించిన ప్రజలపై కక్ష తీర్చుకునే వైపుగా వైసీపీ నాయకులు పోతున్నారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. కృష్ణా నదిలో వదిలిపెట్టిన నాలుగు బోట్లు వైసీపీ వాళ్లవేనని చెప్పారు. ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయడానికి ఆ పార్టీ వాళ్లు ఉద్దేశపూర్వకంగానే వాటిని నదిలో వదిలిపెట్టారని వివరించారు. ఆ బోట్లపై వైసీపీ రంగు ఉందన్న విషయం గుర్తుచేశారు. ఒకదానిని మరొకటి చైన్లతో కట్టి నదిలో వదిలి పెట్టడంతో అవి బ్యారేజీ గోడలను ఢీ కొట్టాయని, ఇప్పటికీ వాటిని బయటకు తీయడానికి అధికారులు శ్రమిస్తూనే ఉన్నారని చంద్రబాబు తెలిపారు.

ఆ బోట్లను ఇసుక అక్రమ రవాణాకు ఉపయోగించే వారని ఆరోపించారు. వైసీపీ లీడర్ జగన్ ఇప్పుడు మాట్లాడుతూ.. ఆ బోట్లు టీడీపీ వాళ్లవేనని తప్పుడు ఆరోపణలు చేస్తున్నార‌ని చంద్రబాబు మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజీని కూల్చాలని కుట్ర చేశారని, దీని వెనక రాజకీయ లింకులు లేకుంటే ఒక్క నిమిషంలో నిందితులను ఏం చేయాలో అది చేసే వాడినని వివరించారు. రౌడీలు, గూండాలను తాను ఎన్నడూ సహించలేదని, సామాన్యులకు ఇబ్బంది కలిగించే వారిపట్ల తానెప్పుడూ కఠిన వైఖరినే అవలంబించానని చంద్రబాబు గుర్తుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement