Saturday, January 11, 2025

AP – గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు – చంద్ర‌బాబు

అమరావతి: గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. తాడేప‌ల్లిలో సిఎం నివాసంలో ఆయ‌న మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కానుందని తెలిపారు. ఈ హైడ్రోజన్తో ఎరువులు, రసాయనాలు తయారవుతాయని పేర్కొన్నారు. హరిత ఇంధనం ద్వారా తయారయ్యే వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తికి హైడ్రోజన్ వాడితే వేడి బాగా తగ్గుతుందని వివరించారు.

గ్రీన్కో కంపెనీ కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్స్ను టేకోవర్ చేయనుంద‌ని చెప్పారు చంద్ర‌బాబు. ఇక్కడ గ్రీన్ అమోనియా తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తామ‌న్నారు. . ఈ ప్లాంట్ కోసం ఆ సంస్థ రూ. 25 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్న‌ద‌న్నారు. రిలయన్స్ కంపెనీ బయో కంప్రెస్డ్ గ్యాస్ తయారీకి 500 కేంద్రాలు పెడుతోంద‌ని, ఒక్కో కేంద్రానికి రూ.130 కోట్లు పెట్టుబడి పెడుతున్నార‌ని వివ‌రించారు. . బయోగ్యాస్ కు ఉపయోగపడే గడ్డి ద్వారా ఈ గ్యాస్ తయారవుతున్న‌ద‌ని వెల్ల‌డించారు. గడ్డి పెంచడానికి ఎకరాకు రూ.30 వేలు కౌలు రైతులకు రిలయన్స్ చెల్లించనుంద‌న్నారు.

- Advertisement -

బెంగళూరు సంస్థ స్వాపింగ్ బ్యాటరీల మోడల్ ను కుప్పానికి తెచ్చింద‌ని ముఖ్య‌మంత్రి వివ‌రించారు. సూర్యఘర్ అమలులో ఉన్న ఇళ్ల యజమానులకు స్వాపింగ్ బ్యాటరీల ఛార్జింగ్ డబ్బు చెల్లిస్తార‌న్నారు. దీంతో వారికి అదనపు ఆదాయం చేకూరనుంద‌ని పేర్కొన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తిపై కొత్త ఆలోచనలు చేస్తున్నామ‌ని,. ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం సౌర ఫలకాలు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు.

సంక్రాంతిని కుటుంబ స‌భ్యుల‌తో జ‌రుపుకోండి…

తెలుగు ప్రజలందరికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరిలో సంక్రాంతి కొత్త వెలుగులు, ఆనందం నింపాలని ఆకాంక్షించారు. పండగ సమయంలో ఊరెళ్లి కుటుంబ స‌భ్యులందరితో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. తాను కూడా అందుకే తాను ప్రతి సంక్రాంతికి ఊరికి వెళ్తున్నట్లు వెల్లడించారు.

“పండగ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఊరు వెళ్లి నలుగురితో కలవటం అలవాటు చేసుకోవాలి. అందుకే నేను ప్రతి సంక్రాంతికి మా ఊరికి వెళ్తాను. ఊరు వెళ్లే సంప్రదాయానికి భువనేశ్వరే కారణం. పాతికేళ్ల క్రితం ఆమె పట్టుబట్టి మొదలు పెట్టిన ఈ సంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నాం. మానవ సంబంధాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఒకచోట అంతా కలవటం,
మాట్లాడుకోవడం ఎంతో అవసరం. మనం ఆనందంగా పండగ చేసుకునేటప్పుడు ఊరిలో పేదవారు కూడా ఆనందంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. వారికి చేయూతనిచ్చి నిలబెట్టాల్సిన బాధ్యత మిగిలినవారిపై ఉంది అని చంద్ర‌బాబు
తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement