కర్నూలు బ్యూరో : బెంగళూరు నుండి కర్నూలుకు (ఓర్వకల్లు)విమాన సర్వీస్ పునరుద్దరణ జరిగినట్లు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డా.బైరెడ్డి శబరి తెలిపారు. శుక్రవారం ఎంపీ శబరి మాట్లాడుతూ… నంద్యాల జిల్లా పరిధిలోని ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి గతంలో ఇండిగో ఎయిర్ లైన్స్ విమానాయ సంస్థ బెంగళూరు నుంచి కర్నూలుకు (ఓర్వకల్లు) సర్వీస్ నడిపేదని కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ విమాన సర్వీస్ రద్దు అయిందని, దీంతో బెంగళూరు నుండి కర్నూలుకు (ఓర్వకల్లు) వచ్చే విమాన ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో బెంగళూరు నుండి కర్నూలుకు (ఓర్వకల్లు) విమాన సర్వీస్ ను పునరుద్దరించినట్లు ఆమె తెలిపారు.
ఈ సర్వీస్ ఆగస్టు 18వ తేది నుండి సోమ, బుధ, శుక్రవారాల్లో నడుస్తుందని శబరి వివరించారు. కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయం నుండి ప్రస్తుతం చెన్నై టూ కర్నూలు, కర్నూలు టూ వైజాగ్ విమాన సర్వీస్ లు నడుస్తున్నాయని, ఆగస్టు 18 నుంచి బెంగళూరు టూ కర్నూలు (ఓర్వకల్లు) కు విమాన సర్వీస్ నడవబోతుందని, అలాగే కర్నూలు నుండి విజయవాడకు విమాన ప్రయాణికుల డిమాండ్ అధికంగా ఉందని, ఈ సమస్యను కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు వివరించగా కర్నూలు టూ విజయవాడకు విమాన సర్వీస్ ను అక్టోబర్ నెలాఖరులోగా నడిపేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు బైరెడ్డి శబరి తెలిపారు.
కర్నూలు(ఓర్వకల్లు) విమానాశ్రయం అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు కృషి చేస్తున్నామని, రన్ వే వెడల్పు, పొడిగింపునకు, రాత్రి వేళలో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అవసరమయ్యే విద్యుధీకరణ పనులకు రూ.113 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, వాటి మంజూరుకు కూడా కృషి చేస్తున్నామని శబరి వివరించారు.