నెల్లూరు (క్రైం)(ప్రభ న్యూస్): రాజమండ్రి నుండి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు గంజాయి తరలిస్తున్నారని సెబ్ జేడీ కె శ్రీలక్ష్మికి వచ్చిన సమాచారంతో ఆదివారం అర్థరాత్రి నుండి సోమవారం తెల్లవారుజాము వరకు జిల్లావ్యాప్తంగా సెబ్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్, కోవూరు, బూదనం టోల్ ప్లాజా తదితర ప్రాంతాలలో ఆర్టీసీ బస్సుల్లో తనిఖీలు చేపట్టగా.. తమిళనాడు, కర్నాటకకు చెందిన 8 మంది నిందితులను సెబ్ అధికారులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 20 లక్షలు విలువచేసే 80.50 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. ఉమేష్‌చంద్ర సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ కె శ్రీలక్ష్మి ఈ గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి వివరాలను వెల్లడించారు.
సెబ్ ఏఈఎస్ కృష్ణ కిషోర్‌రెడ్డి, జేడీ ఇంటెలిజెన్స్ టీమ్, నెల్లూరు సెబ్-1, కోవూరు సెబ్ అధికారులు ఆదివారం రాత్రి నుండి నెల్లూరులోని టోల్ ప్లాజాలు, ఆర్టీసీ బస్టాండ్, జాతీయ రహదారులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న తమిళనాడు రాష్ట్రం తేని జిల్లా కంబం మండలం ఉత్తమపాళ్యం గ్రామానికి చెందిన ఎంఎస్ఎం కుమార్, ఎస్ చల్లాదొరై, జగన్, తంగయ్య, ఆర్ పాండిచల్వం, తేని జిల్లా వర్దనాడు మండలం సింగరాజుపాళెంకు చెందిన పి దేవలం, మధురై జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యంలను అదుపులోకి తీసుకుని 73 కేజీల గంజాయిని, 10 సెల్ఫోన్ల ను స్వాధీనపరుచుకున్నారు.
వీరందరినీ స్టే షన్‌కు తరలించి సెబ్ అధికారులు విచారించగా.. రాజమండ్రికి చెందిన రవి అనే వ్యక్తి వద్ద కేజీ గంజాయి రూ. 6 వేలు చొప్పున కొనుగోలు చేసి తమ ప్రాంతాలలో రూ. 20 వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో వెల్లడించారు. అదేవిధంగా కోవూరు జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులు తనిఖీ చేయగా.. కర్నాటక రాష్ట్రం నార్త్ బెంగుళూరు డీజే హల్లి ప్రాంతానికి చెందిన జబీవుల్లాను సెబ్ అధికారులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 7.50 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. మొత్తం 8 మంది వద్ద సెబ్ అధికారులు స్వాధీనపరుచుకున్న మొత్తం 80.50 కేజీల గంజాయి విలువ రూ. 20 లక్షలు ఉంటుందని జేడీ శ్రీలక్ష్మి పేర్కొన్నారు. వీరందరికీ గంజాయిని సప్ల య్ చేసిన రాజమండ్రికి చెందిన రవిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని జేడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
వారం రోజుల తనిఖీలలో 166.50 కేజీల గంజాయి స్వాధీనం
జిల్లావ్యాప్తంగా వారం రోజులుగా సెబ్ జేడీ టీమ్, స్థానిక సెబ్ అధికారులు టోల్ ప్లాజాల వద్ద, ఆర్టీసీ బస్టాండ్లలో వరుస దాడులు చేస్తూ 15 మంది గంజాయి అక్రమ రవాణాదారులను అదుపులోకి తీసుకుని 166.50 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నామని జేడీ శ్రీలక్ష్మి పేర్కొన్నారు. పట్టుబడ్డ 15 మంది గంజాయి అక్రమ రవాణాదారుల్లో 13 మంది తమిళనాడు, కర్నాటక, కేరళ, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన వారని, ఇద్దరు వ్యక్తులు మన రాష్ట్రానికి చెందిన వారని జేడీ పేర్కొన్నారు. నిత్యం ఈ దాడులు కొనసాగుతూనే ఉంటాయని, చీకటి కార్యకలాపాలపై సమాచారం తెలిస్తే ప్రజలు 100 టోల్‌ఫ్రీ నెంబరుకు సమాచారమిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి అక్రమార్కుల భరతం పడతామని జేడీ శ్రీలక్ష్మి పేర్కొన్నారు.