అమరావతి, ఆంధ్రప్రభ: దేశంలో నెలకొన్న బొగ్గు కొరతను దృష్టిలో ఉంచుకొని వర్షాకాలంలో 24/7 విద్యుత్ అందించడంతోపాటు వ్యవసాయ విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు ముందస్తు చర్యలు చేపట్టాయి. దీనిలో భాగంగా జులై నుండి అక్టోబర్ నెలల మధ్య రోజుకు 500 మెగావాట్ల నుండి 1500 మెగావాట్ల మధ్య విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు టెండర్లు దాఖలు చేసాయి. రాబోయే కాలంలో దేశంలో మరోసారి పెద్ద ఎత్తున బొగ్గు కొరత, విద్యుత్ కొరత రావచ్చన్నహెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. దీనివల్ల విద్యుత్ కొరతను అధిగమించడమేగాక, వర్షాకాలంలో ఏర్పడే అదనపు డిమాండ్‌ను కూడా అందుకునే అవకాశం ఉంటుంది.
పెరగనున్న విద్యుత్ డిమాండ్ :
జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రాష్ట్రంలో నెలవారీ విద్యుత్ డిమాండ్ వరుసగా 5684 ఎంయు, 6517 ఎంయు, 6071 ఎంయు, 6224 ఎంయుగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ దృష్ట్యా జులై, అక్టోబర్ నెలల మధ్య కాలంలో రోజుకి 500 నుంచి 1500 మెగా వాట్ల మధ్య విద్యుత్‌ను కొనుగోలు చేయాలని విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, జూలై నుండి అక్టోబర్ వరకు ఉదయం 5 గంటల నుండి 8 గంటల మధ్య, అలాగే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 12 గంటల మధ్య గరిష్టంగా విద్యుత్ డిమాండ్ ఉండే అవకాశముందని భావిస్తున్నారు. దీనివల్ల రోజువారీ 500 ఎంయూ నుండి 1500 ఎంయూ వరకు విద్యుత్ కొనుగోలు చేయాలని విద్యుత్తు సంస్థలు నిర్ణయించాయి. తద్వారా 24/7 విద్యుత్ సరఫరాకు ఢోకా లేకుండా చూడాలని కార్యాచరణ రూపొందించాయి. విద్యుత్ కొనుగోలు నిమిత్తం షార్ట్ టర్మ్ టెండర్లను దాఖలు చేసాయి. ఈ నెల 28తో టెండర్ ప్రక్రియ పూర్తికానుంది. అలాగే 31 లక్షల టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవాలని కూడా నిర్ణయించారు.
బొగ్గు కష్టాలకు దూరంగా :
దేశంలో గత ఏడాది 1500 మిలియన్ టన్నుల బొగ్గు తవ్వగలిగే అవకాశం ఉన్నప్పటికీ, కేవలం 777 మిలియన్ టన్నులు మాత్రమే తవ్వటం జరిగింది. అనగా బొగ్గు ఉత్పత్తి సామర్థ్యంలో సగం మాత్రమే బొగ్గును మాత్రమే ఉత్పత్తి చేయడం జరిగింది. ఈ కారణాల వల్ల ఈ ఏడాది కూడా థర్మల్ ప్లాంట్లలో తగినంత బొగ్గు నిల్వలు ఉంచడం కష్టతరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది అంతిమంగా రానున్న నెలల్లో మరోసారి బొగ్గు కొరతకు దారితీసే అవకాశం ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో జులై, అక్టోబర్ నెలల మధ్యకాలంలో గత ఏడాదితో పోలిస్తే 6 శాతం విద్యుత్ డిమాండ్ పెరగనుందని అంచనా వేస్తున్నారు. ఈక్రమంలోనే బొగ్గు కొరతను అధిగమించేలా ఇప్పటినుండే ముందస్తు కార్యాచరణతో తగినంత మేర బొగ్గు నిల్వలను సమకూర్చేలా అధికార యంత్రాంగం ముందుకు సాగుతోంది. అందులో భాగంగా 31 లక్షల టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవాలని విద్యుత్ సంస్థలు
లక్ష్యంగా పెట్టుకున్నాయి.
అదే ప్రభుత్వ లక్ష్యం..
కాలం ఏదైనా..వినియోగదారులకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్‌ను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఇంధన శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. ఈమేరకు వర్షాకాలంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై గురువారం ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. బొగ్గు కొరత, ఇతర అంశాల నేపథ్యంలో రాష్ట్రంలో 24/7 విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యల పై చర్చించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌ను అందుకునే స్థితిలో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లు లేవని అధికారులు మంత్రికి తెలిపారు. దేశ వ్యాప్తంగా నెలకొన్న బొగ్గు కొరత దీనికి కారణమని వారు వివరించారు. వర్షాకాలం వల్ల బొగ్గు తవ్వకం, రవాణాకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని దానివల్ల బొగ్గు నిల్వలు పెంచుకునే అవకాశం పెద్దగా ఉండకపోవచ్చునని వారు వెల్లడించారు. ఈక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ, సీజన్ ఏదైనా … 365 రోజులు నిర్విరామంగా వినియోగదారులకు 24/7 విద్యుత్ సరఫరా చేయటం ప్రభుత్వం అంతిమ ధ్యేయమన్నారు. బొగ్గు కొరత కారణంగా ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, వినియోగదారులకు 24/7 నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతోపాటు వ్యవసాయ రంగానికి 9 గంటల పగటిపూట విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత ఏడాది నుంచి దేశంలో తీవ్ర బొగ్గు కొరత ఏర్పడినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 24/7 విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడడంలో విజయవంతం అయిందని మంత్రి పేర్కొన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని, విద్యుత్ రంగంలో ప్రజా ప్రయోజనాలను పరిరక్షించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. దీర్ఘ కాలంలో 24/7 విద్యుత్ సరఫరాను విజయవంతంగా అమలు చేయటమే తమ లక్ష్యమని స్పష్టంచేశారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ రంగాన్ని మరింతగా బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో ఉన్న ఇంటికి కూడా నాణ్యమైన, నమ్మకమైన 24/7 విద్యుత్ సరఫరా అందించడమే ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంని మంత్రి తెలిపారు. అందుకే ఈ ఏడాది వేసవిలో బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధరలు అధికంగా ఉన్నప్పటికీ విద్యుత్ కనుగోలుకు ప్రభుత్వం వెనకాడట్లేదని తెలిపారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న నెలల్లో కూడా 24/7 విద్యుత్ సరఫరాకు కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా చూస్తామని మంత్రి తెలిపారు. ఈ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్యుత్ సంస్థలను ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా , దీని పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి సూచించారు.
బొగ్గు సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ :
రాష్ట్రానికి బొగ్గు సరఫరాను పెంచుకునేందుకు కేంద్ర బొగ్గు, రైల్వే మంత్రిత్వ శాఖలతో ఎప్పటికపుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, ట్రాన్స్‌కో సీఎండీ బీ శ్రీధర్ తో కలిసి మంత్రికి వివరించారు. రానున్న రోజుల్లో పెరగనున్న విద్యుత్ డిమాండ్, బొగ్గు కొరతను దృష్టిలో ఉంచుకొని అవసరమైన చర్యలు తీసుకుంటు-న్నారని తెలిపారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అవాంతరాలు అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిస్కంలను కోరారు. క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు సిబ్బంది ని అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
అడ్డంకులను అధిగమిస్తూ..
ప్రతిపాదిత థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, పవర్ నెట్వర్క్ పటిష్టత తదితర కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ఏపీ విద్యుత్తు సంస్థలు అన్ని విధాలా కృషి చేస్తున్నాయని, వీటి కోసం ఇంధన శాఖ ఎప్పటికప్పుడు నిర్మాణ కార్యకలాపాలను సమీక్షించి ఏదైనా అడ్డంకులు ఎదురైతే నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటోందని విజయానంద్ చెప్పారు. రోజువారీ డిమాండ్ గురించి అధికారులు వివరిస్తూ, జూన్ 22న డిమాండ్ 188.04 మిలియన్ యూనిట్లు(ఎంయు ) ఉండగా, అందులో జెన్కో నుంచి 58.97 ఎంయు, సెంట్రల్ జెనరేటింగ్ స్టేషన్ల నుంచి 24.79 ఎంయు, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుంచి 12.92 ఎంయు, సోలార్ 18 ఎంయు, పవన విద్యుత్ 40. ఎంయు, మార్కెట్లో విద్యుత్ కొనుగోలు 27.11 ఎంయు, హైడెల్ 6 మిలియన్ యూనిట్లు గా నమోదైందని వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.