Saturday, November 23, 2024

ఆందోళ‌న‌క‌రంగా అకాల వర్షాలు : 10వేల ఎక‌రాల్లో పంట న‌ష్టం

క‌ర్నూలు జిల్లాలో ఉపరితలం అవర్తన ప్రభావంతో గత మూడురోజులుగా జిల్లాలో పలుచోట్ల ముసురు ముసురుకుంది. వీటివల్ల కొన్నిచోట్ల తుంపర్లతో కూడుకున్న వర్షం కురువగా, మరికొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంద‌ని వాతవరణ శాఖ సూచించింది. వీటి ప్రభావంతో తీరం వెంబడి 40 నుంచి 50 కిలో మీటర్ల మేర గాలులు వీస్తాయని ప్రకటించింది. ఓవైపు ఉపరిత అవర్తనం, మరోవైపు తూర్పు మధ్య బంగాళఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 4,5 కి.మీ మేర విస్తరించి ఉంది. ఇది నైరుతి దశకు కొనసాగుతుంది. వీటి ప్రభావం కర్నూలు జిల్లాపై కూడా చూపనున్నట్లు వాతవరణ శాఖ వెల్లడించింది. దీంతో బుధ, గురు రెండురోజుల పాటు జిల్లాలో సాధరణ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతవరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో రైతుల గుండెల్లో గుబులు నెలకొంది. ముఖ్యంగా వరి రైతుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతుంది. ఇప్పటికే గత నాలుగు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పలు మండలాల్లో కోత కోసి పొలాల్లో ఉన్న వరిచేలు నీట మునిగాయి. మరికొన్నిచోట్ల గాలులకు నేలకొరిగాయి. వాటిని రైతులు కట్టలుగా కట్టి నిలబెట్టే యత్నం చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలు పడతాయన్న హెచ్చరికలతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

అసలే ఇటీవల కురిసిన గులాబ్‌ తుపాన్‌తో నంద్యాల, ఆదోని డివిజన్‌లలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం చాలాచోట్ల వరిచేలు కోత దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షం కురిసినా, గాలులు వీచినా రైతులకు పంట నష్టం తప్పదని ఆవేదన చెందుతున్నారు. సాధారణంగా జిల్లాలో వరిసాగు 2 లక్షల ఎకరాలు, అయితే ఈమారు వాగులు, చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల కింద భారీగా సాగయ్యాయి. సాధారణ సాగుకు మించి ఈ ఏడాది జిల్లాలో దాదాపు 2.30 లక్షల హెక్టార్లలో వరి సాగుచేశారు. కేసీ, ఎల్‌ఎల్‌సి, వీబీఆర్‌, విఆర్‌ఎస్‌పి, తెలుగుగంగ తదితర కాలువల కింద పంటలు ఎక్కువగా సాగయ్యాయి. ప్రస్తుతం వానాకాలంకు సంబంధించి దాదాపు అరవైశాతం వరికోతలు పూర్తయ్యాయి. ఇంకా 40శాతం పంటపోలాల మీదే ఉన్నాయి. నవంబర్‌ చివరి నాటికి పూర్తిస్ధాయిలో కోతలు ముగిసే అవకాశం ఉంది. కాగా ఇప్పటి వరకు కొతలు ముగిసినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సి ఉంది. ఇటీవలే జిల్లాలో పది వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరా శాఖ అధికారులు ప్రకటించారు. అయితే ప్రకటించిన వాటిలో ఇప్పటికి పూర్తి స్థాయిలో ఎక్కడా ప్రారంభించింది లేదు. నంద్యాల మినహా ఆదోని డివిజన్‌లో కేంద్రాలను ఇంకా నెలకొల్పింది లేదు. ఈ సారి అనుకున్న మేరకు వరిని సేకరిస్తామని అధికారులు ప్రకటించినా కొంత ఇబ్బందులు తప్పలేదు. ముఖ్యంగా వరి సేకరణ కోసం వినియోగించే గన్ని సంచులు కోసం తిప్పలు తప్పడం లేదు. గన్నీ సంచులు ఉంటేనే తూకం వేసేది. ఇది ఇలా ఉండగా, గత రెండు, మూడురోజులుగా అకాశం ముసుర్లు కమ్ముకొని అక్కడక్కడా తేలికపాటి వర్షం కురుస్తుండటంతో వరి కోతలు కోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆకాశం మేఘా వృత్తం కాగానే వరి ధాన్యం రాశులపై ప్లాస్టిక్‌ కవర్లు కప్పడం, పగలు, రాత్రి కాపుకాయడం పరిపాటిగా మారింది. కేంద్రాలు ప్రారంభించిన చోట వచ్చిన ధాన్యంను వచ్చినట్లుగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. అయితే కొంత ఇబ్బందులతో వరి ధాన్యం కొనుగోలు ఆలస్యమ‌వుతుంది. దీంతో చాల వరకు పంట వర్షార్పణం అవ్వక తప్పడం లేదు.


ఆరు మండలాల్లో పంట నష్టం :
జిల్లాలో గత నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాల మూలంగా ఇప్పటికే దాదాపు 10వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు అం చనా వేశారు. మొత్తం ఆరు మండలాల పరిధిలో 28 గ్రామాల్లో ఈ పంట నష్టం జరిగినట్లు గుర్తించారు. ఇందులో వరి దాదాపు 2వేల ఎకరాల్లో నష్టపోగా, వీటితో పాటు మినుము, శనగ ఇతర పంటలు కూడ దెబ్బతిన్నాయి. ముఖ్యంగా చాగలమర్రి, హోళగుంద, దొర్నిపాడు, కోవేలకుంట్ల, కోసిగి, కొలిమిగుండ్ల, తదితర మండలాల్లో వరితో పాటు శనగలు, మినుము పంటలు దెబ్బతినడం విశేషం. ఇప్పటికే జిల్లాలో పదివేల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, ప్రస్తుతం బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరిత అవర్తనం కారణంగా జిల్లాలో మరో రెండురోజుల పాటు వర్షం కురిసే అవకాశముంద‌ని వాతవరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులకు ఆందోళన తప్పడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement