ఇంజనీరింగ్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంసెట్, జాతీయ స్థాయిలో జేఈఈ పరీక్షల నిర్వహణ జరుగుతుంది. వైద్య వృత్తికి సంబంధించి గతంలో ఎంసెట్ ప్రామాణికంగా ఉన్నప్పటికీ పలు కారణాల వలన వైద్య వృత్తికి సంబంధించి జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష జరుగుతోంది. తాజాగా ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి ఎంపీసీ, ఎంఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విన్యాసాలతో ఆందోళన ప్రారంభమైంది. జాతీయ స్థాయిలో పేరుపొందిన ఇంజనీరింగ్ సంస్థల్లో ప్రవేశం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ పరీక్షల తేదీల్లో మార్పులు చేస్తుండడమే ఇందుకు ప్రధాన కారణమవుతోంది.
ఎన్‌టీఏకు అనుగుణంగా ఇంటర్ పరీక్షల తేదీలను మార్చిన ప్రభుత్వం…
జేఈఈ మెయిన్స్ 2022 పరీక్షలకు సంబంధించి ఎన్‌టీఏ తొలుత ఏప్రిల్ 16 నుంచి 21 వరకు నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ తేదీలను ప్రకటించి ఉండడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఈ మేరకు పేరెంట్స్ అసోసియేషన్‌తో పాటు పలు కళాశాలల యాజమాన్యాలు, విద్యారంగ నిపుణులు కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌టీఏ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా తమ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను సవరించి నూతన షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22వ తేది నుంచి మే 12 వ తేది వరకు ఇంటర్మీడియట్‌కు సంబంధించి అన్ని గ్రూపులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
మరోమారు జేఈఈ పరీక్షల తేదీలను సవరించిన ఎన్‌టీఏ..
ఈ దశలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జేఈఈ పరీక్షల తేదీలను మరోమారు సవరించడం రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే ఓ పర్యాయం సవరించి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరలా ఏమి చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది .తాజాగా ఎన్‌టీఏ జేఈఈ పరీక్షలు ఏప్రిల్ 21 నుంచి మే 4వ తేది వరకు వివిధ తేదీల్లో జరుగుతాయని నూతన టైమ్ టేబుల్‌ను ప్రకటించింది. ఆయా పరీక్షల తేదీలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పర్యాయం మార్పు చేసిన ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలకు క్లాష్ అవుతుండడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఇంటర్ పరీక్ష పూర్తి చేయందే జేఈఈలో పాసైనా ఉపయోగం లేదు. జేఈఈ పరీక్షలు వద్దనుకుీంటే ఉన్నత విద్యాసంస్థల్లో చోటు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద మనస్సుతో మరో పర్యాయం ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలను సవరించి జేఈఈ పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. అయితే ఎన్‌టీఏ మరో పర్యాయం జేఈఈ తేదీలను సవరిస్తే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా ఎన్‌టీఏ నిర్వహించే జేఈఈ పరీక్షలకు అనుగుణంగానే ఇంటర్ పరీక్షల్లో మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..