Monday, November 25, 2024

AP | కొరడా జులిపించిన యాంటీ నార్కోటెక్ సెల్… 14 మంది స్మగ్లర్ల అరెస్టు..

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి 100 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గంజాయి, మాదకద్రవ్యాల విక్రయం, వినియోగాన్ని సమూలంగా నాశనం చేస్తామని ఇటీవల రాష్ట్ర హోంమంత్రి అనిత ప్రకటించిన నేపథ్యంలో డిజిపి ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్ వి.రాజశేఖర్ బాబు పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటెక్ సెల్ తన పనిని ప్రారంభించింది.

ఈ క్రమంలో డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ హరికృష్ణ నేతృత్వంలోని యాంటీ నార్కోటెక్‌ సెల్‌ టీమ్‌, సిటీ పోలీస్‌, ల్యాండ్‌ ఆర్డర్‌, టాస్క్‌ఫోర్స్‌ బృందాలు జిల్లావ్యాప్తంగా గంజాయి రవాణా చేస్తున్న అక్రమార్కులను గుర్తించి అరెస్టు చేశారు. వారి నుంచి 90.5 కిలోల గంజాయితో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ హరికృష్ణ ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

పలు కేసులలో అరెస్ట్ కాకుండా తప్పించుకు తిరుగుతున్న, గంజాయి సరఫరా చేయడంలో కీలక వ్యక్తి తో పాటు మాచవరం, సూర్యారావుపేట, భవానీపురం, కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో మరో 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వారిని విచారించి వారి నుంచి 90.5 కిలోల గంజాయి, చోరీకి గురైన యాక్సిల్ బండి స్వాధీనం చేసుకున్నామ‌న్నారు.

గంజాయి అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్న మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒరిస్సా, భరంపూర్ కు చెందిన పింకి రౌత్ తో పాటు… గుంటూరు జిల్లా, తాడేపల్లికి చెందిన గోగినేని మాధవరావు, సుర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో తెలంగాణా, మేడ్చల్, పోతయిపల్లికి చెందిన మురుగన్ మణికంఠ, తెలంగాణా, మేడ్చల్ జిల్లా, పోతయిపల్లికి చెందిన సంకేలి గణేష్, మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో వేరే కేసుకు సంబంధించి కృష్ణా జిల్లా, పెనమలూరుకు చెందిన షేక్ మొహమ్మద్ గౌస్, కృష్ణా జిల్లా, పెనమలూరుకు చెందిన అబ్దుల్ హబీబ్ విజయవాడ అజిత్ సింగ్ నగర్ కు చెందిన మర్రి రఘురాం, విజయవాడ మాచవరం డౌన్ కు చెందిన కొమ్ము రాకేశ్, భవానిపురం పోలీస్ స్టేషన్ కేసులో విజయవాడ భవానిపురంకు చెందిన పాలెటి మమత రాజు, విజయవాడ భవానిపురంకు చెందిన మహమ్మద్ ముజ్జమిల్ సుల్తాన్, విజయవాడ భవానిపురంకు చెందిన షేక్ నజీర్, విజయవాడ భవానిపురంకు చెందిన మత్తే నాని, విజయవాడ భవానిపురంకు చెందిన ఇల్లురి మధుసూదన్ రెడ్డి, కృష్ణ లంక పోలీస్ స్టేషన్ కేసులో విజయవాడ కృష్ణ లంక కు చెందిన అడపాల వంశీ, విజయవాడ కృష్ణ లంక కు చెందిన అమన్ సింగ్ మోహన్లను అరెస్టు చేశామన్నారు.

వీరంతా వివిధ మార్గాల ద్వారా గంజాయికి అలవాటు పడ్డారని, సులువుగా డబ్బు సంపాదించేందుకు అక్రమంగా గంజాయిని కొనుగోలు చేసి విజయవాడలోని పలు ప్రాంతాల్లో యువకులకు విక్రయిస్తున్నారని తెలిపారు. ఈ కేసులలో నిందితులైన మరికొందరు పరారిలో ఉన్నారనీ, వీరితోపాటు గంజాయి సరఫరా చేయడంలో కీలక వ్యక్తి అయిన ఒరిస్సాకు చెందిన పింకి రౌత్ తో సంబంధాలు కలిగిన వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

- Advertisement -

ప్రజలందరూ మీ పరిసర ప్రాంతాలలో ఏమైనా గంజాయి సాగు, మత్తుపదార్ధాలను రవాణా, విక్రయించడం, సేవించడం వాటికి సంబంధించిన సమాచారాన్ని ఈ క్రింది తెలిపిన ప్రత్యేక నెంబర్ 9121162475, మెయిల్ ఐడి [email protected] ల ద్వారా నార్కోటిక్ సెల్ పోలీస్ కి సమాచారం తెలపాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని డిసిపి హరికృష్ణ హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement