అమరావతి, ఆంధ్రప్రభ : విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం రోజుకో కీలక మలుపు తిరుగుతూ వస్తోంది. నిన్నటికి నిన్న ప్రైవేటీకరణ ఆపేదే లేదన్న కేంద్రం, తాజాగా ఈవోఐ బిడ్లకు సంబంధించి గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేంద్ర వైఖరిని నిరశిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రథాన ద్వారం నుండి సింహాచలం వరకూ కార్మికులు పాదయాత్ర ప్రారంభించారు. దీంతో విశాఖ ఉక్కును నిలబెట్టేందుకు ఉద్యమం తీవ్రతరమౌతోంది. ఈనేపథ్యంలోనే వర్కింగ్ క్యాపిటల్, ముడిసరకు కోసం విశాఖ ఉక్కు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇం-టె-స్ట్ (ఆసక్తి వ్యక్తీకరణ) బిడ్ల దాఖలుకు సంబంధించి మార్చి 21న విశాఖ ఉక్కు ప్రకటన విడుదల చేసింది.
దీని గడువు శనివారంతో ముగిసింది. అయితే గడువు తేదీని మరో అయిదు రోజులు పొడిగిస్తున్నట్టు- శనివారం ఆర్‌ఎన్‌ఎల్ ప్రకటించింది. మార్కెటింగ్ శాఖకు మెయిల్, నేరుగా లేదా వ్యక్తుల ద్వారా ఈ వ్యాపారంతో ముడిపడి ఉన్న కంపెనీలు బిడ్లు దాఖలు చేయవచ్చని ప్రకటనలో పేర్కొంది. బిడ్లు దాఖలు చేసే వారు స్టీల్ వ్యాపారంలో ఉండాలని ప్రాథమిక అర్హతగా నిర్ణయించింది. మంచి భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నామన్న విశాఖ ఉక్కు ప్రకటన ప్రకంపనలు రేపింది. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 3గంటలతో బిడ్ల దాఖలు చేసేందుకు గడువు ముగిసింది.
ముందుగా ప్రకటించిన దాని ప్రకారం శనివారం మధ్యాహ్నానికి దాదాపు 22 బిడ్లు దాఖలైనట్టు- సమాచారం. కార్మికుల ఆందోళన నేపథ్యంలో బిడ్ల దాఖలు గడువును మరో ఐదు రోజులు పొడిగించడం పుండుమీద కారం చల్లినట్లయింది. ఈనేపథ్యంలోనే విశాఖ ఉక్కును కాపాడుకోవడం మనందరి బాధ్యత అంటూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఉక్కు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. అంతేకాకుండా ఒక ప్రైవేటు- కంపెనీ ద్వారా బిడ్ దాఖలు చేశారు. ఉక్కు పరిశ్రమ సీజీఎం సత్యానంద్‌కు బిడ్డింగ్ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు పరిశ్రమ తెలుగువారందరికీ బిడ్డలాంటిదని, జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విశాఖ ప్రజల తరపున తాను బిడ్ దాఖలు చేసినట్టు- చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం కొత్త విధానం ద్వారా నిధులు సేకరిస్తామన్నారు. క్రౌడ్ ఫండింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్ వంటి విధానాల ద్వారా నిధులు సేకరించే వెసులుబాటు- ఉందన్నారు. 8.5 కోట్ల మంది నెలకు రూ. వంద చొప్పున విరాళం ఇస్తే నెలకు రూ. 850 కోట్లు- జమ అవుతాయన్నారు. ఇలా నాలుగు నెలల పాటు- చేయగలిగితే స్టీల్ ప్లాంట్ ను నిలబెట్టిన వాళ్లలో మనం ఉండే అవకాశముందన్నారు. ఇది కార్మికుల్లో మంచి స్ఫూర్తిని నింపింది.
సింహాచలం వరకూ పాదయాత్ర
ఇదిలా ఉండగా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపేయాలని కోరుతూ ఏడాదిన్నరకుపైగా ఉద్యమం చేస్తున్న కార్మికులు తమ ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడి కార్మికుల మనోభావాలను పట్టించుకోకుండా కేంద్రం రోజుకో విధంగా ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేయడం కార్మికులకు రుచించడం లేదు. దీంతో శనివారం కార్మిక సంఘాల నేతృత్వంలో స్టీల్ ప్లాంట్ మెయిన్ గేటు నుండి సింహాచలం అప్పన్న స్వామి సన్నిధి వరకూ పాదయాత్ర ప్రారంభించారు. కేంద్రానికి సింహాలచల అప్పన్న మంచి బుద్దిని ప్రసాదించాలని కోరుతూ ఈ పాదయాత్ర ప్రారంభిచామని వారు చెబుతున్నారు.
నిన్నటిదాకా బాకాలూదిన పార్టీలన్నీ సైలెంట్
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తాత్కాలికంగా విరమించుకుంటున్నామని కేంద్ర ఉక్కు సహాయ మంత్రి తొలుత చెప్పినప్పుడు తెలంగాణ మంత్రులు కేటీ-ఆర్, మంత్రి హరీష్ రావులు ఏపీలో అడుగుపెట్టక ముందే బిఆర్‌ఎస్ సాధించిన మొదటి విజయంగా దీనిని అభివర్ణించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ-కరణ చేయొద్దని తను ఢిల్లీ వెళ్లి మరీ కేంద్ర పెద్దలకు విజ్ఞప్తి చేశానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ-కరణపై కామెంట్ చేశారు. ఇక ఈ క్రెడిట్ తమకు ఎక్కడ దక్కకుండా పోతుందోనని వైసీపీమంత్రులు సైతం తమదైన వ్యాఖ్యలు చేశారు. ఇటీ-వల సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీని కలిసిన సందర్భంగా చేసిన విజ్ఞప్తి మేరకు స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని పెద్దఎత్తున ప్రచారం చేసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ ఈ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలని తమ నేత పల్లా శ్రీనివాసరావు ఆమరణదీక్ష చేశారని గుర్తు చేశారు. బిజెపి తమకు ఎక్కడ ప్రాధాన్యత తగ్గుతుందో అని విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో జీవీఎల్ సమావేశం నిర్వహించి హడావిడి చేశారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ పై వెనక్కి తగ్గేది లేదని, ప్రైవేటీ-కరణ చేసి తీరుతామని మరోమారు కేంద్రం స్పష్టం చేసింది. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం వీరోచితంగా పోరాటం చేసింది మేమేనని చెప్పుకున్న నేతలకు ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అయింది.