ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా మలకపల్లి గ్రామ దళిత యువకుడు గెడ్డం శ్రీను హత్య కేసులో ఆరు నెలల తరువాత రీ పోస్ట్ మార్టం చేయాలని హై కోర్ట్ సంచలన ఉత్తర్వులిచ్చింది. రాజకీయ కారణాలతో విచారణ నిష్పక్షపాతంగా జరగలేదన్న పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు. కాగా, 30 రోజుల్లోపు విచారణ పూర్తి చేసి పూర్తిస్థాయిలో రిపోర్ట్ ఫైల్ చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ పోలీసులు, రాజకీయ ప్రయోజనాలతో కేసు నీరుగారుస్తున్నారని న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ కోర్టుకు విన్నవించారు.
రాజకీయ కారణాలతో ఆత్మహత్య అంటూ కేస్ మూసివేస్తున్నరని వాదనలు వినిపించారు. తన కుమారుడిది ముమ్మాటికీ హత్యనే అంటూ మృతుని తండ్రి బుల్లయ్య హై కోర్టులో కేసు దాఖలు చేశారు. కాగా, ఈ కేసులో పలు సెక్షన్ లతో ఏడుగురి మీద ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌తో పాటు హత్య కేసుగా తిరిగి నమోదు చేసినప్పటికీ ఒక్కరినీ కూడా అరెస్టు చేయలేదు అంటూ హైకోర్టులో అడ్వకేట్ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.
అయితే.. మృతుడు పురుగు మందు తాగి చనిపోయాడని.. అతడిని చంపారు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రభుత్వ వాదనలు వినిపించింది. అయినా ప్రభుత్వ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. నిష్ణాతులైన ఎయిమ్స్ డాక్టర్స్ పర్యవేక్షణలో రీ పోస్ట్ మార్టం నిర్వహించాలని, హోం ప్రిన్సిపల్ సెక్రెటరీని న్యాయస్థానం ఆదేశించింది. నిష్పక్షపాతంగా కేసు విచారణ చేయాలని డీజీపీని సైతం న్యాయస్థానం ఆదేశించింది.