Monday, November 18, 2024

రాజధాని రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు మరో అవకాశం.. నెలాఖరు వరకు గడువు పొడిగింపు

అమరావతి, ఆంధ్రప్రభ: రాజధాని అమరావతిలో రిటర్నబుల్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల వ్యవహారం కొలిక్కిరాలేదు.. సీఆర్‌డీఏ గత మూడు నెలల క్రితమే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించింది.. ఈ మేరకు రైతులకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ ఏడాది మార్చి నెలాఖరు నుంచి మే నెలాఖరు వరకు గడువు విధించింది. అయితే హౖౖెకోర్టు తీర్పు ప్రకారం రాజధాని భూ సమీకరణ రైతులకిచ్చే ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పన అనంతరమే రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా మూడు నెలల్లోరైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగించడంతో పాటు ఆరు నెలల్లో అమరావతి రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అమరావతి అభివృద్ధికి వేలకోట్లు వెచ్చించలేమని ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేస్తూ ఐదేళ్లు గడువు కోరిన సంగతి విదితమే. అయితే మౌలిక వసతులు లేకుండా ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ వల్ల ప్రయోజనంలేదని వాదిస్తూ రైతులు సీఆర్‌డీఏ ఇచ్చిన రిజిస్ట్రేషన్‌ నోటీసులను వెనక్కు పంపటంతో పాటు దీనిపై కోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు. సీఆర్‌డీఏ నూతనంగా అమలు చేస్తున్న ఓపెన్‌ ఫోరంలో సైతం రైతులు అవే డిమాండ్లతో వినతిపత్రాలు సమర్పిస్తున్నారు.

రిటర్నబుల్‌ ప్లాట్లలో పిచ్చిచెట్లను తొలగించడంతో పాటు మెరకవేసి చదును చేస్తామని మరోవైపు సీఆర్‌డీఏ అధికారులు హామీ ఇస్తున్నారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు కొందరు ముందుకు రావటంతో.. సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ ఉత్తర్వులు జారీ చేస్తూ గడువును ఈనెలాఖరు వరకు పొడిగించారు. ఇప్పటి వరకు కేవలం 10 శాతం మంది మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. రాజధాని ప్రాంతంలో మొత్తం 17,700 మంది రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉంది. సీఆర్‌డీఏ ఇచ్చిన హామీతో పాటు జాయింట్‌ వెంచర్‌గా ఉన్న వారు, దూరాభారాల్లో ఉన్న రైతులు మొత్తం 929 మంది వరకు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. రెసిడెన్షియల్‌ ప్లాట్లు 555, వాణిజ్య ప్లాట్లు 374 రిజిస్టర్‌ అయ్యాయి. మిగిలిన వారు కూడా రిజిస్ట్రేషన్‌ చేయించుకునే విధంగా ఈనెల 10వ తేదీలోగా నోటీసులు జారీ చేయాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. అయితే రైతులు మాత్రం సీఆర్‌డీఏ నోటీసులను తిరస్కరిస్తున్నారు. హైకోర్టుతీర్పు మేరకు అమరావతినే రాజధానిగా నిర్ణయించి నిర్ణీత గడువులోగా అభివృద్ధి చేస్తేనే రిజిస్ట్రేషన్‌కు ముందుకొస్తామని తేల్చి చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement