అమరావతి, ఆంధ్రప్రభ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఒక కీలక ఘట్టం ముగిసింది. స్పిల్‌వెలో 48 రేడియల్ గేట్ల అమరిక పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్ద విజయవంతంగా పూర్తి చేసింది. 48 గేట్ల అమరిక చివరి ఘట్టాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. డ్యామ్ డిజైన్ ప్రోటోకాల్ కు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి గేట్లను అమర్చినట్టు- మేఘా ఇంజనీరింగ్ సంస్దతో రాష్ట్ర జలవనరుల శాఖ ప్రకటించింది. 2020 డిసెంబర్ 17న గేట్ల అమరిక పనులు ప్రారంభం కాగా సుమారు 15 నెలల కాలంలో 48 రేడియల్ గేట్ల అమరికను పూర్తి చేశారు.
గత ఏడాది వరదలు వచ్చే నాటికి 42 గేట్లను బిగించగా మిగతా 6 రేడియల్ గేట్ల పనులను వరదలు పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టాక ప్రారంభించి సాంకేతికంగా ఆదివారం నాటికి పూర్తి చేశారు. 48 రేడియల్ గేట్లకు ఒక్కొక్క గేటు-కు రెండు చొప్పున మొత్తం 96 హైడ్రాలిక్ సిలిండర్లను అమర్చాల్సి ఉంది. ఇప్పటికే 84 సిలిండర్లను అమర్చారు. ఇపుడు కొత్తగా బిగించిన 6 గేట్లకు సంబంధించి మొత్తం 12 హైడ్రాలిక్ సిలిండర్లను త్వరలోనే అమర్చనున్నారు. హైడ్రాలిక్ సిలిండర్లు జర్మనీ నుంచి రావాల్సి ఉంది. సిలిండర్లు రాగానే గేట్లకు అమర్చి ఆపరేషన్ ట్రయిల్ ప్రారంభించనున్నారు. గేట్లను ఎత్తేందుకు అవసరమైన 24 పవర్ ప్యాక్ సెట్లను ఇప్పటికే ఇంజనీరింగ్ నిపుణులు అమర్చారు.
అదేవిధంగా 10 రివర్ స్లూయిజ్ గేట్లను అమర్చటంతో పాటు- వాటికి అవసరమైన 20 హైడ్రాలిక్ సిలిండర్లు, 10 పవర్ ప్యాక్ సెట్ల అమరిక పనులు కూడా పూర్తయ్యాయి. స్పిల్ వే కాంక్రీట్ పనులు దాదాపు 97.25శాతం పైగా పూర్తయ్యాయి. ఇప్పటివరకు 3,32114 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి..స్పిల్ వే లో కీలకమైన ఫిష్ ల్యాడర్ నిర్మాణం కూడా పూర్తయిందని ఇంజనీర్లు ప్రకటించారు. రేడిటయల్ గేట్లను మేఘా ఇంజనీరింగ్ సంస్థ అమర్చగా జలవనరుల శాఖ ఎస్.ఈ శ్రీనివాస్ యాదవ్, ఈఈలు సుధాకర్, ఆదిరెడ్డి లు పర్యవేక్షించారు. మేఘా ఇంజనీరింగ్ సంస్ద సిజిఎం ముద్దుకృష్ణ, డిజిఎం రాజేష్ కుమార్, మేనేజర్ మురళి తదితరులు పనులను పరిశీలించారు.