Monday, November 18, 2024

AP : మ‌న్యంలో మ‌రో అమానుషం…

ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఏ నాయకులు వచ్చినా.. స్వాతంత్ర్య భారతంలో ఇంకా మౌలిక సదుపాయలకు సైతం నోచుకోని ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి.. రహదారి సౌకర్యం అటుంచితే.. నడవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఏజెన్సీ ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా, అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో విషాదకర ఘటన వెలుగు చూసింది.. రహదారి సౌకర్యం లేక తన కుమారుడి మృతదేహంతో ఏకంగా ఎనిమిది కిలోమీటర్లు నడుకుంటూ స్వగ్రామానికి చేరుకుంది ఓ కుటుంబం.

- Advertisement -

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతగిరి మండలం రోంపిల్లి పంచాయితీ చినకొనేల నుండి గుంటూరు వద్ద కొల్లూరులో ఇటుకల పనికి కుదిరింది ఓ గిరిజన కుటుంబం.. అయితే, సోమవారం సాయంత్రం ఆ గిరిజన దంపతులకు చెందిన మూడేళ్ల బాలుడు మృతిచెందాడు.. ఇక, మృతదేహంతో పాటు ఆ కుటుంబాన్ని వారి బంధువులను విజయనగరం జిల్లా వనిజ వరకు తీసుకొచ్చి వదిలేశాడు ఇటుక బట్టీల యజమాని.. ఆ తర్వాత సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఆ యజమాని వెనుదిరిగి వెళ్లిపోయాడు.. ఇక, అక్కడి నుండి సరైన రహదారి లేక ఎనిమిది కిలోమీటర్ల దూరం మృతదేహంతో నడుచుకుంటూ గ్రామానికి చేరుకుంది ఆ కుటుంబం..

పనికెళ్లిన దగ్గరా గిరిజనులకు అన్యాయం జరుగుతుందని.. ఆ యజమాని మార్గం మధ్యలోనే వదిలేయడంతో.. ఇలా మృతదేహంతో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబ స‌భ్య‌లు.. ఆ వీడియోలో తాత చేతుల్లో బాలుడి మృతదేహం కనిపిస్తుంది.. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement