ఆంధ్రప్రదేశ్లోని వాలంటీర్ల విధుల విషయంలో ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచిన ఎన్నికల సంఘం.. మరో పని నుంచి కూడా వారిని తప్పించింది. రేషన్ పంపిణీలో కూడా వాలంటీర్లు పాల్గొనవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. వాలంటీర్ల స్థానంలో వీఆర్వోలు రేషన్ పంపిణీలో పాల్గొననున్నారు. రేషన్ పంపిణీ సమయంలో ఎక్కడైనా బయోమెట్రిక్ విషయంలో ఇబ్బందులు తలెత్తితే వీఆర్వోలు వాటిని సరి చేయాలని అధికారులు సూచించారు. ఎండీయూ ఆపరేటర్లు సైతం రేషన్ పంపిణీకి వాలంటీర్లను పిలవకూడదని ఈసీ స్పష్టం చేసింది.
ప్రభుత్వం ద్వారా గౌరవ వేతనం తీసుకునే వాలంటీర్ల సంక్షేమ పథకాల పంపిణీ సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసే అవకాశం ఉందంటూ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. వాలంటీర్లను పింఛన్ల పంపిణీలో పాల్గొనవద్దని ఇటీవల ఆదేశించింది. అలాగే నగదు పంపిణీ పథకాల్లో వాలంటీర్లు పాల్గొనవద్దని స్పష్టం చేసింది. ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, ట్యాబులు, ఇతరత్రా పరికరాలను తిరిగి ఇచ్చేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంత వరకూ ఈ ఆదేశాలను పాటించాలని ఈసీ స్పష్టం చేసింది. మరోవైపు ఈసీ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వ అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు.
వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ వద్దన్న ఈసీ ఆదేశాల మేరకు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏపీలో పింఛన్ల పంపిణీ జరగనుంది. ఏప్రిల్ మూడో తేదీ నుంచి సచివాలయాల్లో పింఛన్లను పంపిణీ చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలోనే వాలంటీర్ల నుంచి రేషన్ పంపిణీ విధులను సైతం తప్పించారు. ప్రతినెల మొదటి నాలుగు రోజుల్లోనే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి రేషన్ వాహనాల ద్వారా వాలంటీర్లు రేషన్ పంపిణీ చేస్తున్నారు. దీనికి గానూ ప్రభుత్వం నుంచి గౌరవ వేతనానికి అదనంగా మరికొంత మొత్తం అందుకుంటున్నారు.