ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి మరో జీవో జారీ చేసింది. ఎస్-3 జోన్ పేదల ఇళ్ల స్థలాలకు 268 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆర్ – 5 జోన్లో 1,134 ఎకరాలను పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన పట్టాల పంపిణీకి శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో లబ్దిదారుల సంఖ్య మేరకు అదనంగా భూమి కావాలంటూ కలెక్టర్లు లేఖ రాశారు.
కలెక్టర్ల లేఖ మేరకు అదనపు భూమి కేటాయింపును సీఆర్డీఏ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. సీఆర్డీఏ కమిషనర్ ప్రతిపాదనల మేరకు ఏపీ సర్కార్.. అమరావతి రాజధానిలో ఎస్-3 జోన్లో పేదల ఇళ్ల స్థలాలకు 268 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు చేసింది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్-3 జోన్లోని 268 ఎకరాలను.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు 168 ఎకరాలు, గుంటూరు కలెక్టర్కు 100 ఎకరాలు కేటాయించారు.