Friday, November 22, 2024

రాష్ట్రంలో మరో 13 క్రీడా కేంద్రాలు.. ఒక్కో కేంద్రానికి 7 లక్షలు మంజూరు..

అమరావతి, అంధ్రప్రభ : ఖేలో ఇండియా పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 13 సెంటర్లను కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ మంజూరు చేసినట్టు- పర్యాటక, యువజన సంక్షేమం, సాంస్కృతిక, క్రీడల శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకుగాను ఒక్కోక్క సెంటర్‌కు రూ. ఏడు లక్షలను కేంద్రం మంజూరు చేసిందన్నారు. మంజూరైన నిధులతో అనుభవఙ్ఞుడైన ఒక్కోక్క కోచ్‌ను నియమిస్తారని ఆయన తెలియజేశారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో క్రీడల శాఖ చేపట్టిన కార్యక్రమాలపై మంత్రి అవంతి ఆ శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా ఒక విధానాన్ని, చట్టాన్ని త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

దేశంలోనే క్రీడా చట్టాన్ని రూపొందించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తుందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలు మంజూరు కోసం కృషి చేయాలని, అలాగే కొత్త ప్రతిపాదనలను సిద్దం చేసి కేంద్రం ఆమోదం కోసం పంపించాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి కప్‌కు సంబంధించి ఇప్పటికే అయిదు జిల్లాలో క్రీడా పోటీలు జరిగాయని, మిగతా జిల్లాలో ముఖ్యమంత్రి కప్‌ క్రీడా పోటీలు జరిగేటట్టు చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆటస్ధలాలు అభివృద్ధి, ఆయా జిల్లాలో క్రీడలశాఖ పనితీరుపైన ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ క్రీడామండలి మేనేజింగ్‌ డైరక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి, శాప్‌ పరిపాలనాధికారి రామకృష్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement