తిరుమలలో వచ్చే నెల (అక్టోబర్) లో జరిగే విశేష ఉత్సవాలను టీటీడీ అధికారులు ప్రకటించారు. అక్టోబర్ నాలుగు నుంచి 12వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నట్టు ప్రకటించారు. కాగా అక్టోబర్ 3న అంకురార్పన జరగనుండగా.. అక్టోబరు 4న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టిటిడి అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహన సేవలు ఉంటాయి. అక్టోబరు 8వ తేదీన గరుడ సేవ ఉంటుంది. ఇక అక్టోబరు 9వ తేదీన స్వర్ణరథం, 11వ తేదీన రథోత్సవం ఉంటాయి. ఇక 12వ తేదీన చక్రస్నానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల వేళ పలు రకాల ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేయనుంది.