శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 29 నుంచి మార్చి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఉంటాయని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 28న సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రోజూ ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వాహనసేవలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
29వ తేదీన ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని టీటీడీ అధికారులు వివరించారు. మార్చి 1న ఉదయం చిన్నశేష వాహనంపై, రాత్రి హంస వాహనంపై, 2న ఉదయం సింహవాహనంపై, రాత్రి ముత్యపుపందిరి వాహనంపై శ్రీవారు ఊరేగుతారని తెలిపారు. 3న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం, 4న ఉదయం పల్లకీ ఉత్సవం (మోహినీ అవతారం), రాత్రి గరుడ వాహనం, 5న ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజ వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారని పేర్కొన్నారు.
6న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 7న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 8న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో కార్యక్రమాలు ముగుస్తాయని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల ముందు ఫిబ్రవరి 22న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తామని అధికారులు వివరించారు.