అమరావతి, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీలో ఎన్నికల కసరత్తు పూర్తిస్థాయిలో మొదలైంది. తెలంగాణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇక రాష్ట్ర ఎన్నికలకు సన్నాహాలు మొదలవుతున్న క్రమంలో అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. గతానికి భిన్నంగా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు మరోక కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు మేనిఫెస్టో విడుదలతో పాటు తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించాలన్న ఆలోచనలో ఉన్నారు.
దాదాపుగా ఫిబ్రవరి రెండు, మూడు వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేయాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. కేసుల చక్రబంధం నుంచి దాదాపు ఊరట లభించడంతో చంద్రబాబు మళ్లి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టడంతో పాటు రాజకీయ కార్యకలాపాలను యథావిధిగా మొదలుపెట్టారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా తొలి విడత జాబితాను విడుదల చేస్తే పార్టీకి మేలు జరుగుతుందన్న భావనలో టీడీపీ అధిష్టానం ఉంది. దీంతో 80 నుంచి 100 మంది అభ్యర్థులను తొలి జాబితాలో ఖరారు చేయాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే కొంతమంది అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అధిష్టానం ఇక పూర్తిస్థాయిలో అధికారిక ప్రకటన చేయాలన్న యోచనలో ఉంది. గతంలోనే 19 మంది సిట్టింగ్‌లకు తిరిగి అవకాశం కల్పిస్తున్నట్లుగా చంద్రబాబు అధికారిక ప్రకటన చేశారు. ఈ 19 మందితో పాటు తాజాగా మరో 80 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం జనసేన, టీడీపీ కలిసి ముందుకు సాగుతోంది. ఇప్పటికే 30 స్థానాలకు సంబంధించి జనసేన కీలక ప్రతిపాదనలు చేసింది. వీటిపై కూడా త్వరలోనే స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు వివాదంలేని కొన్ని స్థానాలపై దృష్టి పెట్టారు.
ఇప్పటికే రెండు విడతలు ప్రతి నియోజకవర్గ ఇంఛార్జ్‌తో చంద్రబాబు వన్ 2 వన్ భేటీలు నిర్వహించి సర్వేలు, పార్టీ సేకరించిన రిపోర్ట్ వివరాలను వారి ముందుంచారు. అలాగే నియోజకవర్గాల్లో పరిస్థితులు, వారి బలాబలాలపై ఒక స్పష్టతనిచ్చారు. ఈ వన్ 2 వన్ మీటింగ్లలోనే చంద్రబాబు కొందరి అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నియోజకవర్గాల్లో ఉంటూ ప్రజలతో కలిసి పనిచేయాలని ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాటిని ఓట్ల రూపంలో మలుచుకోవాలని నిర్దేశించారు. మరికొందరికి పరోక్ష సంకేతాలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ స్థానాలపై కూడా ఒక క్లారిటీ ఇవ్వనున్నారు.
జనసేనకు కేటాయించాల్సిన సీట్లు పోగా మిగిలిన స్థానాలపై చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. రిమాండ్ సమయంలో అభ్యర్థుల ఖరారు అంశంపై వర్క్ఔట్ చేసిన ఆయన ఇప్పుడు స్థానిక పరిస్థితులు, కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల అభిప్రాయాలకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే జనవరి మొదటి వారంలో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయాలన్న నిర్ణయానికి రెండు పార్టీలు వచ్చాయి.
ఈ కార్యక్రమానికి రెండు, మూడు రోజుల ముందు లేదా ఆ తర్వాత టీడీపీ అభ్యర్థుల ప్రకటనను అధికారికంగా చేయాలన్న నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లుగా సమాచారం. ముందస్తు అభ్యర్థుల ప్రకటన ద్వారా నియోజకవర్గాల్లో బలాన్ని పుంజుకుని అభ్యర్థులు గెలుపొందేందుకు అవకాశం దక్కుతుందన్న ఆలోచనలో టీడీపీ అధినాయకత్వం ఉంది. త్వరలో సర్వే నివేదికలతో పాటు పార్టీ రహస్య సర్వే నివేదికలు అధిష్టానం వద్దకు చేరనున్నాయి. ఈ నెల చివరి వారంలోగా అభ్యర్థుల ఎంపికను పూర్తిస్థాయిలో వర్క్ఔట్ చేసి కొత్త ఏడాదిలో విడుదల చేయాలన్న యోచనలో టీడీపీ అధిష్టానం ఉంది.
టీడీపీ నేతల్లో టెన్షన్..
ఇదిలా ఉంటే అధిష్టానం టికెట్ల కేటాయింపుపై దృష్టి పెట్టడంతో తమకు అవకాశం లభిస్తుందా..? లేదానన్న టెన్షన్ టీడీపీ నేతల్లో నెలకొంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో పరిస్థితులు, నేతల పనితీరు, ఇతర అంశాలపై దృష్టి పెట్టిన చంద్రబాబు కీలక మార్పుల దిశగా అడుగులు వేయడం కూడా పార్టీ నేతల్లో కొంత గుబులు రేకెత్తిస్తోంది. ఇంఛార్జ్‌ల మార్పు జరుగుతున్న తరుణంలో ముందు ముందు ఏ విధమైన నిర్ణయాలను అధిష్టానం తీసుకుంటుందోనన్న ఆందోళన కొందరి నేతల్లో ఉంది.