Monday, September 16, 2024

Annamaiah Dt – గ్యాస్ సిలిండ‌ర్ పేలి…. ముగ్గురు మృతి

మృతుల‌లో త‌ల్లి ఇద్ద‌రు ,పిల్ల‌లు
అన్న‌మయ్య జిల్లాలో ఘ‌ట‌న
ప్ర‌మాద ప్రాంతాన్ని సంద‌ర్శించిన మంత్రి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం కొత్తపేటలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో తల్లి సహా ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పట్టణంలోని తొగట వీధిలో జరిగిన ఈ ఘటనలో లక్కిరెడ్డిపల్లె మండలం ఎర్రగుడికి చెందిన రమాదేవి(34), తన ఇద్దరు పిల్లలు మనోహర్‌(8), మన్విత(5) సజీవ దహనమయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

రమాదేవి భర్త రాజా జీవనోపాధి కోసం కువైట్ కు వెళ్లి.. అక్కడే పనిచేస్తున్నాడు. రమాదేవి స్థానికంగా టైలరింగ్ పనిచేస్తూ.. పిల్లల్ని చూసుకుంటోందని స్థానికులు పోలీసులకు తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకునే సరికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. అప్పటికే ముగ్గురూ మరణించడంతో.. పోస్టుమార్టంకు తరలించి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ప్రమాదవశాత్తు జరిగిందా ? లేక ఎవరైనా కావాలని చేశారా ? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు. రాయచోటి డీఎస్పీ రామచంద్రయ్య ఘటనాస్థలిని పరిశీలించారు.

ప్ర‌మాద ప్రాంతాన్ని సంద‌ర్శించిన మంత్రి…

ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. మృతదేహాలకు నివాళులు అర్పించి.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో ముగ్గురు కుటుంబ సభ్యులు మరణించడం బాధాకరమన్నారు. అలాగే.. ఎవరికైనా ఎలాంటి సమస్యలున్నా వాటి పరిష్కార మార్గాలను చూడాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఈ ఘటనపై న్యాయవిచారణ చేయాలని, దీనికి వేరెవరైనా బాధ్యులైతే.. వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement