(ఆంధ్రప్రభ స్మార్ట్ , అన్నమయ్య బ్యూరో) – అన్నమయ్య జిల్లాలో వైసీపీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర మంగళవారం విజయవంతంగా సాగింది. ముందుగా సత్యసాయి జిల్లా నుంచి ఉదయం 10:30 కు ముఖ్యమంత్రి జగన్ అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకలచెరువుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేరుకుంది. ములకలచెరువులో బస్టాండ్ లో కొంతసేపు ఆపి అక్కడున్న ప్రజలకు బస్సు లోపల నుంచి జగన్ అభివాదం చేశారు. అక్కడ నుంచి బయలుదేరిన బస్సు మొలకలచెరువు మండలం పెద్దపాలెం గేటు వద్ద ఆగింది. అక్కడ కొంతమందిని ముఖ్యమంత్రి జగన్ వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముబిషీర్ అహమ్మద్, భవ్య ఆసుపత్రి అధినేత సుబ్బారెడ్డి తదితరులు వైసీపీలో చేరారు. అక్కడ నుంచి కదిలిన బస్సు అంగళ్లు సమీపంలోని గోల్డెన్ వ్యాలీ కళాశాలకు చేరుకుంది. ఆ కళాశాలలో సీఎం జగన్ బస్సు నుంచి దిగి మహిళా అధ్యాపకురాలు మంజుల బృందంతో కొంతసేపు మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని తిరిగి అధికారంలోకి తేవాలని ఆయన కోరారు.
విశ్వం కాలేజీలో మధ్యాహ్న భోజనం..
అక్కడ నుంచి కదిలిన బస్సు అంగళ్లు మీదుగా మదనపల్లి రోడ్డు లోని విశ్వం కాలేజీకి మధ్యాహ్నం 1.40 గంటలకు చేరుకుంది. ఆ కళాశాలలోనే సీఎం జగన్ బస్సు యాత్ర బృందానికి భోజన ఏర్పాట్లు చేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో దారి పొడవునా ముఖ్యమంత్రి కి జనం నీరాజనం పలికారు.మండుటెండలో సైతం ప్రజలు ముఖ్యమంత్రికి అభివాదం తెలుపుతూ నిలబడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , స్థానిక ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి, మదనపల్లి వైసీపీ అభ్యర్థి నిస్సా రహమత్ మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం మదనపల్లి టిప్పు సుల్తాన్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.