నేడు దివంగతనేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామరావు 101వ జయంతి. ఈ సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. టీడీపీ ఛీఫ్ చంద్రబాబు ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకుంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలుగు వెలుగు, తెలుగుజాతికి స్ఫూర్తి, కీర్తి…అన్న ఎన్టీఆర్ అని అన్నారు.
“క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయి. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్…తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థం అని చెప్పి, ఆచరించి చూపారు. సంక్షేమంతో పాటే అభివృద్ధికి, పాలనా సంస్కరణలకు కూడా బాటలు వేశారు. ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని చాటి చెప్పారు. ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజల ఆత్మబంధువు అయ్యారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం…ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందాం.” అని చంద్రబాబు పేర్కొన్నారు.