Wednesday, November 20, 2024

Humanity | అన్నా నిన్ను వదిలి వెళ్లలేం.. కంటతడి పెట్టుకున్న గన్‌మెన్లు, ఓదార్చిన కోటంరెడ్డి

ఏపీ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం సృష్టించారు నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి. ఏపీలోని ప్ర‌భుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప‌లువురు మంత్రుల ఫోన్‌ల‌ను ట్యాప్ చేసి దొంగ‌చాటుగా త‌మ మాట‌లు వింటోంద‌ని ఆరోపించారు. అంతేకాకుండా దానికి సంబంధించిన ఓ రికార్డుని కూడా బ‌య‌ట‌పెట్టి ప్ర‌భుత్వానికి స‌వాల్ విసిరారు. దీంతో ఏం చేయాలో తోచ‌ని ఏపీ స‌ర్కారు.. డిఫెన్స్‌లో ప‌డిపోయింది. అదంతా వ‌ట్టిదేన‌ని, రికార్డింగ్‌ని ట్యాపింగ్ అంటూ ప్ర‌చారం చేస్తున్నార‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు చెప్పుకొచ్చారు. అయినా ఆ వ్య‌వ‌హారం ఏపీతో పాటు చుట్టుప‌క్క‌ల రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది.

ఇక‌.. వైసీపీ ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డికి అప్ప‌టిదాకా ఉన్న సెక్యూరిటీని ప్ర‌భుత్వం త‌గ్గించింది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంతో వార్తల్లో నిలిచిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి భద్రతను కుదించింది ప్ర‌భుత్వం. 2+2 గన్‌మెన్లలో ఇద్దరిని తొలగించింది. బెదిరింపు కాల్స్‌ వస్తున్న ఈ తరుణంలో తనకు ఉన్న భద్రతను కుదించడంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మిగిలిన ఇద్దరు గన్‌మెన్లు కూడా అక్కర్లేదు.. మీకే పంపిస్తున్నా అంటూ వాళ్లను తిరస్కరించారు. ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ కోటంరెడ్డి ఈ విషయం చెప్పారు.

అయితే కోటంరెడ్డిని వదిలివెళ్లేందుకు గన్‌మెన్లకు మనసు ఒప్పుకులేదు. అన్నా నిన్ను వదిలి వెళ్లలేమూ అంటూ ఎమ్మెల్యేను చూస్తూ ఎమోషనల్‌ అయ్యారు. వెక్కి వెక్కి ఏడుస్తున్న గన్‌మెన్లను ఈ సంద‌ర్భంగా కోటంరెడ్డి ఓదార్చారు. గుండెలకు హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యారు. వాళ్లకు అండగా ఉంటానని తెలిపారు. గన్‌మెన్లను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై కోటంరెడ్డి మాట్లాడుతూ.. ఎవరి ఆదేశాలతో చేశారో తెలియదు గానీ.. ప్రభుత్వ పెద్దలు చెప్పకుండా జరగదని అన్నారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్న ఈ సమయంలో అదనపు భద్రత కల్పించాల్సింది పోయి.. ఉన్న వాళ్లను తొలగిస్తారా? అని మండిప్డడారు. ఇద్దరు గన్‌మెన్లతో పాటు మిగిలిన ఇద్దరు గన్‌మెన్లను కూడా మీకే గిఫ్ట్‌ ఇస్తున్నా.. తీసుకోండి అని అన్నారు. ఇకపై ఎక్కడైనా ఒంటరిగానే తిరుగుతానని.. ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement