తిరుమల, ప్రభన్యూస్ : తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాలకట్ల ఆణివారి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్, చిన్న జీయర్ స్వాములు, టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో విలేకరులతో మాట్లాడుతూ, సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కామానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివారి ఆస్థానం అని పేరు వచ్చిందన్నారు. పూర్వం మహంతులు దెెవస్థానం పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివారి ఆస్థానం పర్వదినంనాటి టిటిడి వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంబమయ్యేవని తెలిపారు. టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను ఏప్రి ల్, మార్చినట్టు వివరించారు. సాయంత్రం 6 గంటలకు పుష్పపు పల్లకి పై స్వామి, అమ్మవారు నాలుగు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఉదయం బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనం పై ఉభయ దేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠం పై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు.
అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేధించారు. అనంతరం పెద్దజీయర్‌స్వామి పెద్ద వెండి తట్టలో ఆరు పెద్ద పట్టు వస్త్రాలను తల పై పెట్టుకుని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. చిన్నజీయర్ స్వామి, ఈవో ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు. నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విశ్వక్సేనుల వారికి అలంకరించారు. అనంతరం శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో పరివట్టం ( చిన్నపట్టు గుడ్డ ) కట్టుకుని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్యైశ్వర్యోభవ అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తరువాత అర్చకులు పెద్దజీయర్, చిన్నజీయంగార్లకు టిటిడి తరపు ఈవో ధర్మారెడ్డి లచ్చన అను తాళకు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు. హారతి, చందనం, తాంబూలం, తీర్ధం, శ ఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవిగుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచండో ఆణివారి ఆస్థానం ముగిసింది.
శ్రీరంగం నుంచి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పణ
ఆణివారి ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీరంగనాథస్వామివారి ఆలయ అధికారులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం శ్రీభేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మటం నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.