Friday, November 15, 2024

TTD: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం

వార్షిక లెక్కలు ప్రారంభించిన రోజు : టీటీడీ ఈవో జె.శ్యామలరావు
శ్రీరంగం నుండి శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ

తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయ‌ర్‌స్వామి, టీటీడీ ఈవో జె.శ్యామలరావు పాల్గొన్నారు. ముందుగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారు వాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు.

అనంతరం పెద్దజీయర్‌స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. చిన్నజీయ‌ర్‌స్వామి, ఈవో, ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు. నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామి వారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు.

అనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో ”పరివట్టం”(చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తరువాత అర్చకులు పెద్దజీయ్య‌ర్ కు, చిన్న జీయ్య‌ర్ కు, టీటీడీ తరఫున ఈవోకి ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు. ”రూపాయి” హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచ‌డంతో ఆణివార ఆస్థానం ముగిసింది.

- Advertisement -

వార్షిక లెక్కలు ప్రారంభించిన రోజు : టీటీడీ ఈవో
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ…. సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి రోజున‌ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తార‌ని చెప్పారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వ‌చ్చింద‌న్నారు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవ‌ని తెలిపారు. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్‌ నెలలకు మార్చిన‌ట్టు వివ‌రించారు. సాయంత్రం పుష్ప‌ప‌ల్ల‌కీపై స్వామి, అమ్మ‌వారు నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తార‌ని తెలిపారు.

  ఈ కార్యక్రమంలో జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్ఓ  నరసింహ కిషోర్, ఆలయ ప్రధాన అర్చకులు  వేణుగోపాల్ దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు, ముఖ్య అర్చకులు కిరణ్ స్వామి, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, అదనపు ఆరోగ్యశాఖ అధికారి సునీల్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ…
ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం రంగ‌నాథ‌స్వామి తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంగళవారం ఉదయం బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల తిరుమల పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడినుండి తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు, తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్‌స్వామి, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం కలిసి పట్టువస్త్రాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల ప్ర‌ద‌క్షిణ‌గా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు దేవాదాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి కుమార గురుబాలన్, శ్రీరంగం ఆలయ ఆలయ జాయింట్ కమిషనర్ మారియప్పన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement