రాయలసీమ ప్రతినిధి, ప్రభన్యూస్: మూగ జీవాల ఆరోగ్య పరిరక్షణ కోసం వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను రాయలసీమలోని అనంతపురం, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, తిరుపతి, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలలోని తొలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కొక్క వాహనాన్ని అందించనున్నారు. గురువారం ముందుగా ఈ రథాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయం నుండి జెండా ఊపి ప్రారంభిస్తారు. పశువులు అనారోగ్యానికి గురైనపుడు 1962 టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేస్తే వాహనంతో పాటు సహా పశువైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని వైద్యం అందించడమే ఈ రథం యొక్క లక్ష్యం.
ఈ వాహనంలో పశువైద్యుడితో పాటు వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్, ముగ్గురు సిబ్బంది ఉంటారు. పేడ సంబంధిత పరీక్షలు 22 రకాల రక్త సంబంధిత పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా చిన్న ప్రయోగశాల కూడా ఈ వాహనంలో ఏర్పాటు చేశారు. ఒక్కొక్క వాహనం నిర్వహణకు రూ. 1.90 లక్షల చొప్పున రెండేళ్లకోసం కోట్లాది రూపాయల నిధులు కేటాయించారు. అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి ఒక్కొక్క వాహనం, మిగిలిన జిల్లాల్లో కూడా నియోజకవర్గానికో వాహనాన్ని కేటాయించనున్నారు. ఈ పశు ఆరోగ్య సేవా రథాలకు సంబంధించి ఇప్పటికే సంబంధిత జిల్లాలో పశువైద్యాధికారి ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. కర్నూలు జిల్లాలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ రామచంద్రయ్య ఇప్పటికే దాదాపు 5 సార్లు జిల్లా సిబ్బందితో ఈ రథానికి సంబంధించి ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..