Sunday, November 17, 2024

అంగన్‌వాడీకి ‘అద్దె’ పెరిగింది..! ప్రాంతాల వారీగా అద్దె రుసుము పెంచుతూ ప్రభుత్వ ఆదేశాలు

అమరావతి, ఆంధ్రప్రభ : అంగన్‌వాడీలకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న కేంద్రాల బాడుగ రుసుమును పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసి అంగన్‌వాడీలకు ఊరటనిచ్చింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అద్దె రుసుమును ప్రభుత్వం పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వులు అంగన్‌వాడీల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను ఫౌండేషన్‌ స్కూల్స్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు వాటిని సౌకర్యవంతమైన కేంద్రాలుగా తీర్దిదిద్దే అంశంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే అద్దె అంగన్‌వాడీల అద్దె రుసుమును పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో అందుకనుగుణంగా చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తూనే మరోవైపు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మరోవైపు గర్భిణీలు, బాలింతలకు కూడా పౌష్టికాహారాన్ని అందిస్తోంది. తాజాగా అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఆ కేంద్రాల వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టింది.

అద్దె భవనాల్లో చాలీచాలని గదుల మధ్య అరకొర వసతులతో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహణలో ఉన్న అవస్థలను గుర్తించిన ప్రభుత్వం అద్దె ధరలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు కొత్తగా అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక ఇబ్బందులు, ఆర్ధిక కారణాల రీత్యా పనులు సక్రమంగా సాగని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అద్దె అంగన్‌వాడీల మెరుగుదలకు కార్యాచరణను చేపట్టింది. గతంలో చాలా స్వల్ప మొత్తంలో ఉన్న అద్దె ధరలను పెంచుతూ కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో 257 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 55 వేల 607 అంగన్‌వాడీ కేంద్రాలు ఉంటే వాటిలో 23 వేల 758 ప్రస్తుతం అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. నాడు – నేడు పథకం కింద ప్రభుత్వ భవనాల్లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునీకరించిన అధికారులు ఇప్పుడు అద్దె అంగన్‌వాడీల్లో సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టారు.

పెరిగిన అద్దెలు ఇలా..

అద్దె అంగన్‌వాడీల కొత్త అద్దెలను ప్రభుత్వం నిర్దేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాలకు ఒక అద్దె ధరను, మున్సిపాలిటీలు, పట్టణాలు, కార్పొరేషన్లకు వేర్వేరు ధరలను నిర్ణయిస్తూ ఆదేశాలను వెలువరించింది. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో రూ. వెయ్యి మాత్రమే అద్దె చెల్లిస్తుండగా దానిని తాజాగా రెట్టింపు చేసింది. రూ. 2 వేలకు పెంచుతూ ఆదేశాలిచ్చింది. ఇక పట్టణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో గతంలో రూ. 4 వేలు అద్దె రుసుము ఉండగా ఇప్పుడు దానిని రూ. 6 వేలకు పెంపుదల చేసింది. ఇక కార్పొరేషన్లలో గతంలో రూ. 6 వేలు అద్దె చెల్లిస్తుండగా తాజాగా దానిని రూ. 8 వేలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. అద్దె ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం వాటిని ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. పెంచిన అద్దె ధరల ప్రకారం గత రెండు నెలలుగా చెల్లించాల్సిన అద్దెను పెంచి చెల్లించనున్నారు. అద్దె ధరలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అంగన్‌వాడీలు, ఐసీడీఎస్‌ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న అద్దె ధరల పెంపుపై సంతోషాన్ని వెలుబుచ్చుతున్నారు.

- Advertisement -

పెరగనున్న వసతులు..

ప్రభుత్వం అద్దె రుసుమును పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో వసతులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇరుకు గదుల్లో కేంద్రాల నిర్వహణ సాగుతుండగా తాజాగా పెంచిన రుసుముతో కొంత విశాలమైన భవనాలను అద్దెకు తీసుకునే వెసులుబాటు అంగన్‌వాడీ నిర్వాహకులకు కలగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో కొంత మెరుగైన వాతావరణం ఉన్నప్పటికీ పట్టణాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మాత్రం చాలా చిన్న గదుల్లోనే ఈ కేంద్రాలు నడుస్తున్నాయి. ప్రభుత్వం పెంచిన అద్దె రుసుముతో ఇప్పుడు మరోగది అదనంగా లభించే అవకాశాలు ఉన్నట్లుగా అంగన్‌వాడీలు పేర్కొంటున్నారు. చిన్నారుల ఆట, పాటలకు, మధ్యాహ్న భోజన పథకాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందన్న భావనను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement