Tuesday, November 26, 2024

సంపూర్ణ పోషక కేంద్రాలుగా అంగన్‌వాడీలు.. పోషణ ప్లస్‌ తో ఎక్కువ మందికి లబ్ధి

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను సంపూర్ణ పోషక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు శ్రేష్టమైన పౌష్టికాహారాన్ని అందిస్తోంది. మూడు నుంచి ఆరేళ్ల లోపు ప్రీ-స్కూల్‌ బాల బాలికల్లో పోషకాహార లోపాలు, రక్తహీనత నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టింది. గతానికి భిన్నంగా రాష్ట్రప్రభుత్వం రెండు కీలక పథకాలను మహిళలు, చిన్నారుల కోసం తీసుకువచ్చి అమలు చేస్తోంది. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ ప్లస్‌ పథకాల ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలను ఆరోగ్య కేంద్రాలుగా తీర్దిదిద్దేపనిలో నిమగ్నమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 55 వేల 607 అంగన్‌వాడీ కేంద్రాల్లో తాజాగా మధ్యాహ్నభోజన పథకాన్ని తీసుకువచ్చింది. కరోనా ఉధృతి నేపథ్యంలో గతంలో అమలవుతున్న ఈ పథకం మార్చి 2020లో నిలిచిపోయింది. ఆ సమయంలో చిన్నారులు, మహిళలకు ఇచ్చే పోషకాలను నేరుగా ఇంటికే అందజేసింది. ప్రస్తుతం కరోనా ఉధృతి రాష్ట్రంలో దాదాపుగా అదుపులోకి రావడంతో మళ్లిd ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. నిత్యం పోషకాలతో కూడిన సమగ్రమైన ఆహారాన్ని అందించే విధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఒక ప్రత్యేక మెనూను కూడా రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఈ మెనూ ప్రకారం అంగన్‌వాడీ కేంద్రాల్లో వేడివేడిగా వండిన ఆహారాన్ని సరఫరా చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. వారంలో ఆరు రోజుల పాటు ఈ పథకం అమలు చేయాలని నిర్దేశించింది. ప్రతిరోజు ఆకుకూర, దోసకాయ, టమోట, మునగాకు, కోడిగుడ్డును తప్పనిసరిగా అందించాలని స్పష్టం చేసింది. ఈ నెల 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల్లో మధ్యాహ్నభోజన పథకం విజయవంతంగా అమలవుతోంది. వీటితో పాటు ప్రతి మంగళవారం చిన్నారులకు పులిహోర, గర్భిణీలు, బాలింతలకు ఎగ్‌ ప్రైడ్‌రైస్‌, శనివారం వెజిటబుల్‌ రైస్‌లను అందించే విధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక మెనూను అమలు చేస్తోంది. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో జగనన్న గోరుముద్ద తరహాలో సమగ్రమైన పోషకాలు చిన్నారులు, మహిళలకు అందించే విధంగా సమగ్ర ప్రణాళికను రూపొందించి ముందుకు సాగుతోంది.

రోజురోజుకూ పెరుగుతున్న లబ్ధిదారులు..
అంగన్‌వాడీ కేంద్రాల్లో లబ్దిదారుల సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం ఈ పథకం విజయవంతంగా సాగుతోంది. పట్టణాల నుంచి పల్లెల వరకు అమలవుతున్న ఈ పథకానికి లబ్దిదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. బలవర్ధకమైన ఆహారంతో పాటు మంచి పోషకాలను మహిళా శిశు సంక్షేమ శాఖ అందిస్తుండటంతో లబ్దిదారుల సంఖ్య క్రమేణా పెరుగుతూ వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మైదాన ప్రాంతాల్లో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం ద్వారా 31 లక్షల 85 వేల 359 మందికి లబ్ది చేకూరుతోంది. అలాగే గిరిజన ప్రాంతాల్లో రక్తహీనత, పోషకాహార లోపాలు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ వైఎస్సార సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం ఈ పథకం కింద మూడున్నర లక్షల మంది చిన్నారులు, మహిళలకు సంపూర్ణ పోషకాహారాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ అందిస్తోంది. ఈ రెండు పథకాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షలకు పైగా మహిళలు, చిన్నారులకు బలమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఇదే సమయంలో అంగన్‌వాడీ కేంద్రాల్లోనే వయసుకు తగినట్లుగా ఎదుగుదల లేని చిన్నారులను గుర్తించేందుకు ప్రత్యేకంగా గ్రోత్‌ మానిటరింగ్‌ డ్రైవ్‌ను మహిళా శిశు సంక్షేమ శాఖ చేపట్టింది. ఎదుగుదల లేని చిన్నారులను గుర్తించి వారికి అవసరమైన ఆహారంతో పాటు మందులను కూడా ఉచితంగా అందించే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు దాదాపు 25 లక్షల మంది చిన్నారులకు గ్రోత్‌ మానిటరింగ్‌ డ్రైవ్‌ను నిర్వహించారు. ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగినట్లుగా బరువు లేని వారు 11 శాతం మంది ఉన్నట్లుగా గుర్తించారు. వీరందరికీ ప్రత్యేక పౌష్టికాహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే బాలింతలు, గర్భిణీల్లో రక్తహీనత, పోషకాహార లోపాలను నివారించేందుకు కూడా చర్యలు తీసుకుంటోంది. గర్భం దాల్చిన సమయం నుంచి డెలివరీ అయ్యాక కూడా వారికి సమగ్రమైన పోషకాహారంతో పాటు మందులను ఉచితంగా అందిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement