అమరావతి, ఆంధ్రప్రభ: అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అమలును రాష్ట్ర ప్రభుత్వం పటిష్టం చేస్తోంది. ఆట – పాటలతో చిన్నారులకు మెరుగైన ఫౌండేషన్ అందేలా చర్యలు చేపడుతోంది. చిన్ననాటి నుంచే ఇంగ్లీష్‌తో పాటు మాతృభాషపై పట్టును పెంపొందించేలా ప్రత్యేక పాఠ్యాంశాలను రూపొందించి బోధనకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. చిన్నారుల్లో మేథాశక్తికి దోహదం చేసే ప్రత్యేక కిట్లను అందించాలని నిర్ణయం తీసుకుని అమలుకు సన్నాహాలు చేస్తోంది. చిన్నారులకు సులువుగా పాఠ్యాంశాలు అర్థం కావాలన్న లక్ష్యంతో 19 రకాల ఆట వస్తువులు, ఉపకరణాలతో ప్రత్యేక కిట్లను రూపొందిస్తోంది.
ఈ కిట్లలో పలకతో పాటు రెండు పెన్సిళ్లు, 12 స్కెచ్ పెన్నులు, ఎరైజర్, షార్ప్‌నర్ లాంటి వస్తువులను ప్రతి విద్యార్థికి అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మూడు నుంచి ఆరేళ్లలోపు వయసు కలిగిన అంగన్‌వాడీ కేంద్రాల్లోనే చిన్నారులందరికీ ఈ కిట్లను అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8.50 లక్షల మంది చిన్నారులకు ఈ కిట్లను అతి త్వరలో పంపిణీ చేయనున్నారు. ఈ నెలాఖరు నాటికి కేంద్రాలకు ఈ కిట్లు సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు శిశు సంక్షేమ శాఖకు ఆదేశాలు కూడా జారీ చేసింది.
కేంద్రాలకు 19 రకాల ఆట వస్తువులతో కిట్లు..
రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు 19 రకాల ఆట వస్తువలతో కూడిన కిట్లను తాజాగా ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ కిట్లలో చిన్నారులకు ఆట – పాటలతో అభ్యాసం సాగించేలా వివిధ రకాల ఫజిల్స్, అబాకస్, రంగురంగుల పేపర్లతో కూడిన ఆట వస్తువులు, వాటర్ కలర్స్, పెన్సిళ్లు, ట్రేసింగ్ బోర్డ్‌లు, బొమ్మల తయారీకి ఉపయోగపడే మట్టి ముద్దలు, మ్యూజిక్ పరికరాలు, 20కి పైగా స్టోరీ బుక్స్‌ను పొందుపర్చి పంపిణీ చేశారు. ఇంకోవైపు చిన్నారుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం వారికి ప్రత్యేక పోషకాహారాన్ని అందిస్తోంది.
అలాగే చిన్నారుల ఎదుగుదల లోపాలకు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఎత్తును కొలిచే స్కేళ్లను అంగన్‌వాడీలకు అందజేశారు. ఈ నెలాఖరు నాటికి వెయింగ్ మిషన్లు కూడా అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇంకోవైపు పోషకాహార మెనూను చిన్నారులకు యథావిధిగా అమలు చేయాలని శిశు సంక్షేమ శాఖ అదేశాలిచ్చింది. అయితే వారంలో రెండ్రోజులు పప్పులో గానీ, ఇతర వంటకాలలో మునగాకు తప్పనిసరి గా ఉపయోగించాలని స్పష్టం చేసింది.
ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైలట్ ప్రాజెక్ట్ మెనూ ఎన్టీఆర్ జిల్లాలో విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలని పేర్కొంది. మునగాకులో సమగ్ర పోషకాలు ఉన్న నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. రోగ నిరోధక శక్తి పెరిగి చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారని ఈ నేపథ్యంలో వారంలో రెండుసార్లు కచ్ఛితంగా మునగాకుతో పౌష్టికాహారాన్ని అందించాలని ఐసీడీఎస్ అధికారులు అంగన్‌వాడీలకు ఆదేశాలు జారీ చేశారు.