Saturday, November 23, 2024

AP: అంగ‌న్వాడీ కేంద్రాల‌కు సొంత భ‌వ‌నాలు నిర్మించాలి.. కేశినేని శివ‌నాథ్

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో 1,457 అంగ‌న్ వాడీ కేంద్రాలు వుండ‌గా వాటిలో 892 అంగ‌న్ వాడీ కేంద్రాలకు సొంత భ‌వ‌నాలు లేవ‌ని, అందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణదేవికి విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ లోని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని గురువారం ఆమె ఛాంబర్ లో కలిసి ఎన్.టి.ఆర్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి చేయాల్సిన అభివృద్ధి పనుల అనుమతి కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.

జిల్లాలో సొంత భ‌వ‌నాలు వుండి ప్ర‌హారీ గోడ‌లు లేని 357 అంగ‌న్వాడీ కేంద్రాల‌కు ప్ర‌హారీ గోడ‌ల నిర్మాణం, అద‌నంగా మ‌రో 60 అంగ‌న్వాడీ కేంద్రాల ఏర్పాటు, సొంత భ‌వనాలు లేని 892 అంగ‌న్వాడీ కేంద్రాల‌కు సొంత భ‌వ‌నాల ఏర్పాటుకు అనుమ‌తి ఇవ్వాల్సిందిగా అభ్య‌ర్థించ‌టం జ‌రిగింది. అలాగే విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం అంగన్వాడీ కేంద్రాలు 1,457 వుండ‌గా, వీటిలో స్వంత భ‌వ‌నాలు కేవ‌లం 583 అంగ‌న్వాడీ కేంద్రాల‌కు మాత్ర‌మే వున్న‌ట్లు తెలియజేశారు. ఇందులో 226 కేంద్రాలకు మాత్ర‌మే కాంపౌండ్ వాల్ వున్న‌ట్లు వివ‌రించారు. ఎం.పి కేశినేని శివనాథ్ చేసిన అభ్యర్థన‌పై కేంద్ర‌మంత్రి అన్నపూర్ణ దేవి సానుకూలంగా స్పందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement